logo

పట్టాలెక్కని అధునాతన పరిజ్ఞానం

ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. రైల్వే వ్యవస్థల్లో భద్రత ఎంతన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated : 04 Jun 2023 04:37 IST

నెమ్మదిగా సాగుతున్న రైల్వే ప్రాజెక్టులు

ఒడిశా ఘటనతోనైనా పనులు చేపట్టాలి

బోగోలు స్టేషన్‌ దగ్గర ఎత్తు తక్కువగా ఉన్న ప్లాట్‌ఫారం

ఈనాడు, కర్నూలు, బి క్యాంపు, మద్దికెర, వెల్దుర్తి, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. రైల్వే వ్యవస్థల్లో భద్రత ఎంతన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 180 కి.మీ రైల్వే మార్గం ఉంది. పట్టాలపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు అధునాతన మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలి. కాలానుగుణంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆచరణలోకి తీసుకురావాలి. స్టేషన్ల పరిధిలో రైల్వే వ్యవస్థను ఆధునికీకరించాలి. ఆ ప్రక్రియ అమలు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల నేటికీ అత్యంత వెనుకబడి ఉందనే చెప్పుకోవచ్చు.

ఇంటర్‌ లాకింగ్‌ సదుపాయమేదీ

కర్నూలు నుంచి డోన్‌ మధ్య 14 లెవల్‌ క్రాసింగ్‌ గేట్లు ఉన్నాయి. అందులో ఎనిమిది గేట్లకు ఇంటర్‌ లాకింగ్‌ సదుపాయం లేదు. కర్నూలు- దూపాడు మధ్యలో లెవల్‌ క్రాసింగ్‌ గేటు నంబరు 137, దూపాడు- ఉలిందకొండ మధ్య ఎల్‌.సి. గేటు నంబరు 141, ఉలిందకొండ- వెల్దుర్తి మధ్య గేటు నంబర్లు 149, 150, వెల్దుర్తి బోగోలు మధ్య గేటు నంబర్లు 156, 158, బోగోలు-డోన్‌ మధ్య 162, 164 ఎల్‌.సి.గేట్లకు ఇంటర్‌ లాకింగ్‌ సదుపాయం లేకపోవడంతో మానవ తప్పిదాలు కారణంగా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఇంటర్‌ లాకింగ్‌ సదుపాయం ఉన్న గేట్లను సమకూర్చకపోవడం గమనార్హం.

పట్టాలు పర్యవేక్షించేవారేరీ

ట్రాక్‌ నిర్వహణలో గ్యాంగ్‌మెన్ల పాత్ర కీలకం. రైలు పట్టాలు పూర్తిస్థాయిలో సురక్షితంగా ఉంచడంలో వీరిదే కీలకపాత్ర. స్టేషన్ల వారీగా నిర్ణీత సెక్షన్ల పరిధిలో వీరు విధులు నిర్వర్తిస్తుంటారు. ఏసెక్షన్లో ఎంత మంది ఉన్నారన్న విషయాలు అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. కీలక బాధ్యతలు నిర్వహించే గ్యాంగ్‌మెన్ల ఖాళీల సంఖ్య భారీగా ఉంది. కొరత కారణంగా అందుబాటులో ఉన్నవారిపై పని ఒత్తిడి పెరగడంతో పర్యవేక్షణ మొక్కుబడిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రమాదకరంగా ప్లాట్‌ఫారం

బోగోలు, ఉలిందకొండల్లో ప్లాట్‌ఫారం ఎత్తు మరీ తక్కువగా ఉంది. వెల్దుర్తిలో రైలు మెట్లకు సరిపడా ఎత్తులో ప్లాట్‌ఫారం లేదు. కర్నూలు స్టేషన్లో నేటికీ మూడు ప్లాట్‌ఫారాలే ఉన్నాయి. మరో రెండు లైన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి ప్లాట్‌ఫారాలు లేవు.

విషాద ఘటనలు

2002 డిసెంబరు 21న అర్ధరాత్రి 12.45 గంటలకు కాచిగూడ- బెంగళూరు రైలు పెండేకల్లు- పగిడిరాయి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఆ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 మంది గాయపడ్డారు. ఇంజిన్‌తోపాటు తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఏడు స్లీపర్‌, ఒక జనరల్‌ బోగీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలు కోసేయడంతోనే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది. 2018 అక్టోబరు 3న కర్నూలు స్టేషన్‌ ఆవరణలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. అదే ప్రాంతంలో 2019 మార్చి 3న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది.

ప్యానెల్‌ ఇంటర్‌ లాకింగే దిక్కు

* సిగ్నలింగ్‌ వ్యవస్థలో ఎస్‌ఎస్‌ఐ (సాలిడ్‌ స్టేట్‌ ఇంటర్‌ లాకింగ్‌) కన్నా అత్యాధునికమైన ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌(ఈఐ) ఏర్పాటు చేస్తున్నారు. డోన్‌ పరిధిలో డబ్లింగ్‌ చేసినప్పుడు ఎస్‌ఎస్‌ఐ నుంచి ఈఐకి మార్చారు. డోన్‌- నంద్యాల మధ్యనే అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది మిగిలిన ప్రాంతాల్లో నేటికీ పాత విధానాలే ఉపయోగిస్తున్నారు.

* బోగోలు, వెల్దుర్తి, ఉలిందకొండ, దూపాడు, కర్నూలు నగరంలో సుమారు 20 ఏళ్ల కిందటి ప్యానెల్‌ ఇంటర్‌ లాకింగ్‌(పి.ఐ.) పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. డోన్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు ప్రస్తుతం సింగిల్‌ లైన్‌ ఉంది. డబ్లింగ్‌ చేసినప్పుడు ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావొచ్చన్న ఉద్దేశంతో వదిలేయడం గమనార్హం.

నత్తనడకన విద్యుదీకరణ

మద్దికెర- గుంతకల్లు మధ్య కొనసాగుతున్న డబ్లింగ్‌ పనులు

* గుంతకల్లు- గుంటూరు (403 కి.మీ) మార్గంలో రైల్వే డబ్లింగ్‌ పనులకు ఆ శాఖ రూ.3,280 కోట్లు మంజూరు చేసింది. 2018లో పనులు ప్రారంభించగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మద్దికెర- గుంతకల్లు మధ్య 10 కి.మీ మేరకు నత్తను తలపిస్తున్నాయి. డోన్‌- నంద్యాల మార్గంలో పలు చోట్ల పుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులతో పాటు, ఇతర అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

మల్లెపల్లె, బింగిదొడ్డి ప్రాంతాల్లో లెవల్‌ క్రాసింగ్‌ల దగ్గర అండర్‌పాస్‌ల నిర్మాణం, వెల్దుర్తి ప్లాట్‌ఫారం ఎత్తు పెంచే పనులు నత్తను తలపిస్తున్నాయి. బింగిదొడ్డికి వెళ్లే మార్గంలో రైల్వే భూగర్భ వంతెన నిర్మాణ పనుల్లో బండరాళ్ల మధ్య కంకర పోస్తుండటం గమనార్హం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని