logo

బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు.

Published : 28 Mar 2024 03:28 IST

వైకాపా సభకు 500 సర్వీసుల తరలింపు

కర్నూలు బస్టాండులో ప్రయాణికుల నిరీక్షణ

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. గతంలో జరిగిన వివిధ సభలకు పెద్దఎత్తున బస్సులు మళ్లించడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో ఆయన ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తుండటంతో హడలిపోతున్నారు. బస్సులన్నింటినీ మళ్లించడమేకాక గంటల తరబడి ట్రాఫిక్‌ ఆపేయడం.. పరదాలు కట్టడం.. దుకాణాలు మూసివేయించడం తదితరాలన్నీ గుర్తు చేసుకుని జనం ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ సభలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించి రాత్రి ఆళ్లగడ్డ చేరుకున్నారు. నంద్యాల పట్టణంలో గురువారం, ఎమ్మిగనూరులో శుక్రవారం పర్యటించనున్నారు.

ముందుగానే తరలింపు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని డిపోల నుంచి సుమారు 500 బస్సులను మంగళవారమే మళ్లించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్‌, ఆళ్లగడ్డ డిపోల నుంచి 70 శాతానికిపైగా బస్సులు మళ్లించారు. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కర్నూలు-1, 2, నంద్యాల డిపోల్లో 100కుపైగా బస్సులు, మంత్రాలయం, శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూరు, బనగానపల్లి, కోవెలకుంట్ల డిపోల నుంచి 50 శాతానికిపైగా బస్సులు కేటాయించారు.

గంటల తరబడి నిరీక్షణ

బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లేవారి పరిస్థితి దయనీయంగా మారింది. మూడు గంటలకుపైగా నిల్చున్నా ఒక్క బస్సు రాలేదు. ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బస్సులు లేవని ముందుగానే చెబితే తమ ప్రయాణాలు రద్దు చేసుకునేవాళ్లమని ప్రయాణికులు అధికారులను నిలదీశారు.

బస్సు వద్ద పరుగులు పెడుతున్న జనం

ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాలకు ప్రతిరోజు నాలుగు ట్రిప్పుల చొప్పన బస్సులు నడవాల్సి ఉంది. మంగళవారం రాత్రి నుంచే బస్సుల ట్రిప్పులను రెండుకు కుదించేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రెండు ట్రిప్పులు కూడా తిరగలేదు. చివరికి చాలామంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. వేసవి కావడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. బుధవారం 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
  • కర్నూలు నుంచి గ్రామీణ ప్రాంతాలకు గంటకు ఒక బస్సు రాకపోకలు సాగించాల్సి ఉంది. మూడు, నాలుగు గంటలు దాటినా బస్సులు రాకపోవడం గమనార్హం. చివరి ట్రిప్పు ఇదేనని.. మళ్లీ రాదని అధికారులు చెప్పడంతో అప్పటికప్పుడు ప్రయాణికులు అరకొరగా వచ్చిన బస్సుల వద్దకు పరుగులు తీయాల్సి వచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని