logo

వైకాపాను భూ స్థాపితం చేయాలి

ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు.

Published : 19 Apr 2024 02:34 IST

బుడ్డా రాజశేఖర్‌
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

ఆత్మకూరు, నంద్యాల బొమ్మలసత్రం, న్యూస్‌టుడే : ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. అనంతరం ఆత్మకూరులోని గౌడ్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. సహజ వనరులను దోచుకుని, పేదవారిని అణచివేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కరవైందన్నారు. జగన్‌రెడ్డి బాదుడుతో బెంబేలెత్తిపోయిన జనం ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం వెనుక జలాలను ఎత్తిపోసి వరదరాజస్వామి ప్రాజెక్టును నింపకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని 2019 ఎన్నికల ముందు చెప్పిన శిల్పా చక్రపాణిరెడ్డి మాట తప్పి ఈ రోజు నామినేషన్‌ వేశారని ధ్వజమెత్తారు. శ్రీశైల దేవస్థానంలో కొడుకు పేరుమీద ప్రైవేటు ఏజెన్సీ పెట్టి నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలు దోచుకుంటున్నారని ఆరోపించారు. దేవస్థానం నెలనెలా రూ.18 వేలు చెల్లిస్తుంటే అందులో ఉద్యోగులకు రూ.9 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ము స్వాహా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే వర్ధన్‌ బ్యాంక్‌లో చేసిన మోసాలు వెలికితీసి శిల్పాను పోలీసు జీపు ఎక్కిస్తానని హెచ్చరించారు. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి శ్రీశైల దేవస్థానంలో ఉద్యోగాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. తాము గెలిస్తే స్థానికేతరులను తొలగించి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. శిల్పా అనుచరులు గంజాయి విక్రయిస్తూ యువతను బానిసలుగా మారుస్తున్నారని, అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతామన్నారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ముంచేశారని విమర్శించారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని శ్రీశైలం నుంచి తరిమివేయాలన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు, శ్రీశైల నియోజకవర్గంలో బుడ్డా రాజన్న రాజ్యం రావాలన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బుడ్డాను, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, బుడ్డా సతీమణి శైలజ, కుమార్తె మేఘనారెడ్డి, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు