logo

గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం

పంచాయతీ, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్‌ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం

Published : 24 Apr 2024 05:41 IST

నేడు పంచాయతీ రాజ్‌ దినోత్సవం
న్యూస్‌టుడే, కర్నూలు జడ్పీ


పెద్దల మాట

గ్రామ స్వరాజ్యం సాధనలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ కీలకమైంది.. స్థానిక సంస్థలు స్వపరిపాలన చేసినప్పుడే అది సాధ్యమవుతుంది.

మహాత్మా గాంధీ మాట


జగన్‌ కుట్ర

పంచాయతీ, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్‌ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు పూర్తి అధికారాలు దఖలు పరచకపోగా వాటికున్న పరిమిత అధికారాల్ని కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఫలితంగా పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి.


చిల్లిగవ్వ విదల్చని ఆర్థిక మంత్రి

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాలుగుసార్లు జడ్పీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయారని సభ్యులు వాపోతున్నారు. ‘‘ అధికారి పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యులుగా ఉండీ ఏమాత్రం ఉపయోగం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం గౌరవ వేతనం కూడా సరిగా ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. టీఏ, డీఏలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాలను పలుమార్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. సీపీడబ్ల్యూఎస్‌ పథకానికి సంబంధించి రూ.91 కోట్ల వరకు విద్యుత్తు బకాయిలున్నాయిని, వీటికి ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలని తీర్మానించారు. ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల కాలేదు.


అధికారం తీరుపై సభ్యుల గుర్రు

2021 సెప్టెంబరు 25న జడ్పీ పాలక వర్గం ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో 52 మంది జడ్పీటీసీ సభ్యులు, 53 మంది ఎంపీపీలు అధికార పార్టీకి చెందినవారున్నారు. వీరిలో అధిక శాతం అసంతృప్తికి గురవుతున్నారు. పనులు చేసేందుకు నిధులు ఇవ్వడం లేదని చాలా మంది అసంతృప్తితో కొనసాగుతున్నారు. జడ్పీ సమావేశాలకొస్తే టీఏ, డీఏలు ఇవ్వడం లేదు.. గౌరవ వేతనం సరిగా అందడం లేదని సభ్యులు వాపోతున్నారు. రెండేళ్లలో ఒక జడ్పీటీసీ సభ్యునికి రూ.5 లక్షల విలువైన పనులు గతేడాది ఇచ్చారు.. అవీ మంజూరు కావడం లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం ద్వారా రూ.12.70 కోట్లు, తలసరి గ్రాంట్ ద్వారా రూ.86 లక్షలు, సీనరేజి ద్వారా రూ.3.40 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ ద్వారా రూ.2.81 కోట్లు జడ్పీ ఖజానాకు చేరుతున్నాయి. జడ్పీకి స్టాంపు డ్యూటీ రూ.2.65 కోట్ల రావాల్సి ఉంది.


ఇసుక తోడి.. నిధుల గండి

గ్రామ స్వరాజ్యానికి మూలస్తంభంలాంటి పంచాయతీ వ్యవస్థను జగన్‌ పతనం చేశారు. పంచాయతీలకు సర్వాధికారాలు కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి తూట్లు పొడిచారు. గ్రామ సచివాలయాల పేరుతో ఒక సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలకు ఇసుక, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే సెస్సు ప్రధాన ఆదాయ వనరు. వైకాపా ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి గనుల శాఖ ద్వారా ఇసుక విక్రయం చేపట్టింది. రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచి ఓ సంస్థకు అనుమతులు వచ్చేలా చేసింది. పేరుకు ఆ సంస్థ ఉన్నప్పటికీ బినామీ ద్వారా తుంగభద్ర తీరం వెంట ఇసుక విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి వచ్చే ఆదాయంలో స్థానిక సంస్థలకు సెస్సు రూపంలో ఇవ్వాలి. వాటికి ఎగనామం పెట్టారు.


ఖాతా ఖాళీ చేశారు

జగన్‌ గద్దెనెక్కిన తర్వాత పంచాయతీ నిధులు దారి మళ్లిస్తున్నారు. వాస్తవానికి ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల్లో పది శాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలి. ఆ సొమ్ములోంచే విద్యుత్తు బకాయిలు చెల్లించాలి. కానీ, జగన్‌ సర్కారు సగటున 24 శాతం నుంచి 90 శాతం వరకు ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల నుంచి ఖాళీ చేసింది. మురుగు కాల్వలను శుభ్రం చేసేందుకు సొమ్ముల్లేవు.. మంచినీటి పైప్‌లైన్ల మరమ్మతులకు పైసల్లేవు.. ఆఖరికి బ్లీచింగ్‌, ఫాగింగులకూ డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. ఏ పని చేసేందుకు కూడా సర్పంచుల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్‌. ఏదీ చేయలేక గ్రామస్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచులు నెత్తీనోరూ కొట్టుకున్నా జగన్‌ వినిపించుకోలేదు.


జడ్పీ ముఖం చూడని ఎమ్మెల్యేలు

పల్లె ప్రజల వెతలు వినిపిద్దామని ప్రాదేశిక సభ్యులు జిల్లా పరిషత్‌కొస్తే వినాల్సిన ఎమ్మెల్యే జడ్పీ ముఖం చూడటం లేదు. గత ఐదేళ్లలో కొందరు అడుగేపెట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మండలానికే బాస్‌లా వ్యవహరించే జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు వైకాపా హయాంలో నామమాత్రంగా మారారు. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి ఒక్కసారి కూడా జడ్పీ స్థాయీ సంఘాలతోపాటు సర్వసభ్య సమావేశాలకు హాజరుకాకపోవడం గమనార్హం.

మొత్తం పంచాయతీలు: 973,  
మేజర్‌: 32, మైనర్‌ : 941
(ప్రస్తుతం సర్పంచులు ఉన్నది 970)
ఉమ్మడి కర్నూలులో మండల పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీలు): 804
జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు (జడ్పీటీసీలు) : 53

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని