logo

అతివలకు అవకాశం తక్కువే!

అతివల్ని ఆకాశంలో సగం అంటూ పొగడటమే తప్ప ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది తక్కువే.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో పురుషులతో సమానంగా ఓటు హక్కు ఉన్న మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

Updated : 09 Nov 2023 06:41 IST

కొత్తకోట, న్యూస్‌టుడే: అతివల్ని ఆకాశంలో సగం అంటూ పొగడటమే తప్ప ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది తక్కువే.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో పురుషులతో సమానంగా ఓటు హక్కు ఉన్న మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల నాటి నుంచి నవంబరు 30న జరగనున్న ఎన్నికల వరకు పరిశీలిస్తే ఇదే కళ్లకు కడుతుంది. రాష్ట్రంలో 1952లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా అప్పటి పరిగి నియోజకవర్గం నుంచి షాజహాన్‌బేగం, మక్తల్‌ నుంచి శాంతాబాయి పోటీ చేసి గెలుపొంది మహిళా ప్రతినిధుల ఖాతా తెరిచారు. తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 13 మంది మహిళలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగా ఎనిమిది మంది శాసనసభలో అడుగు పెట్టారు. వీరిలో ఆరుగురు కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం వహించగా ఇద్దరు తెదేపా నుంచి ప్రాతినిధ్యం వహించారు. 15 సార్లు సాధారణ ఎన్నికలు జరగ్గా వాటిలో 1972, 1978, 1994లో అసలు మహిళలకు పోటీ చేసే అవకాశమే దక్కలేదు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ అతివలు చాలా తక్కువ మందే బరిలో నిలిచారు.  

తాజాగా..: తాజాగా(నవంబరు 30న) జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యం అంతంతే. భారాస అన్ని సీట్లను పురుషులకే కేటాయించగా కాంగ్రెస్‌ ఇద్దరు మహిళలకు ఈసారి టికెట్లు కేటాయించింది. సరిత(గద్వాల), పర్నికరెడ్డి(నారాయణపేట) బరిలో నిలిచారు. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బోయ స్వప్నకు పోటీ చేసే అవకాశం కల్పించారు. మక్తల్‌ నియోజకవర్గం బహుజన లెఫ్ట్‌ పార్టీ (నాగలిగుర్తు) నుంచి మంజుల నామినేషన్‌ దాఖలు చేశారు. కొల్లాపూర్‌ నుంచి ధర్మసమాజ్‌ పార్టీ నుంచి పాన్‌గల్‌ మాజీ ఎంపీపీ ఆది సంధ్యారాణి నామినేషన్‌ వేశారు. ఇక్కడి నుంచే మహిళా కాంగ్రెస్‌ బాధ్యురాలు కాటమోని తిరుపతమ్మ స్వతంత్ర, బర్రెలక్కగా యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించే కర్నె శిరీష నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అలంపూర్‌ నుంచి ప్రేమలత నామినేషన్‌ దాఖలు చేశారు.
జయలక్ష్మీదేవమ్మ: అలంపూర్‌ నియోజకవర్గం నుంచి 1957లో పోటీ చేసిన జయలక్ష్మీదేవమ్మ(కాం), తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిపై 78 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1962లో జరిగిన ఎన్నికల్లో అమరచింత నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిపై 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1967లో జరిగిన ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ అదే అభ్యర్థి చేతిలో 2,465 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

రాణీ కుముదినీదేవి: సంస్థానాధీశులు పాలించిన వనపర్తిలో అప్పటికీ వారి అజమాయిషీ ఉండేది. సంస్థానానికి చెందిన రాణీ కుముదినీదేవి 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున నుంచి పోటీ చేసి 22 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి 14,420 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు.
ఇందిర: ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా ఉన్న ఇందిరను 1985లో తెదేపా తరపున షాద్‌నగర్‌ (ఎస్పీ రిజర్వు) నుంచి పోటీ చేయించారు. రాజకీయాలకే కొత్త అయిన ఆమె తెదేపా ప్రభంజనంలో 7,018 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో పోటీచేయగా 8,700 ఓట్ల తేడాతో ఓటమి పాలవ్వడంతో ఆ తర్వాత తెదేపాను వీడి మరో పార్టీలో చేరినా పోటీ చేసే అవకాశం దక్కలేదు.

షాజహాన్‌బేగం: ప్రజాస్వామ్య పద్ధతిలో తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పరిగి ఒకటి. అక్కడి నుంచి షాజహాన్‌బేగం(కాంగ్రెస్‌) గెలుపొందారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో పరిగి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లగా 1957లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఏర్పడ్డ షాద్‌నగర్‌ నుంచి పోటీ చేసి ప్రాతినిధ్యం వహించారు.
డీకే అరుణ: గద్వాల నియోజకవర్గం నుంచి 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున తొలిసారిగా పోటీ చేసిన డీకే అరుణ తెదేపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో   సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుబంధ సభ్యురాలిగా ఉండి మంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ విజయాన్ని దక్కించుకొన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

స్వర్ణ సుధాకర్‌రెడ్డి: అమరచింత నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్ణ సుధాకర్‌రెడ్డి 13,783 ఓట్ల తేడాతో తెదేపా అభ్యర్థిపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో దేవరకద్ర నియోజక వర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి  సీతాదయాకర్‌రెడ్డి(తెదేపా) చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత వైకాపాలో చేరారు. ఆ తర్వాత తెరాసలో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో టికెట్‌ ఆశించినా నిరాశే మిగిలింది.
కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి : దేవరకద్ర శాసససభ స్థానం నుంచి 2009లో తెదేపా అభ్యర్థిగా కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డికి అవకాశం దక్కింది. అప్పటికే  జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమె ఈ ఎన్నికల్లో 19,036 ఓట్ల మెజార్టీతో స్వర్ణసుధాకర్‌రెడ్డిపై విజయం సాధించారు.

శాంతాబాయి: మక్తల్‌-ఆత్మకూర్‌ నియోజకవర్గం నుంచి 1952లో శాంతాబాయి (కాం) పోటీ చేసి గెలుపొందారు. 1957 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1962లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1967లో ద్యాప గోపాల్‌రెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు. ఈ ఎన్నిక నిబంధలకు విరుద్ధంగా జరిగిందని కోర్టుకెళ్లి ఎన్నికను రద్దు చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని