logo

నీడ చాటున నిధులు మాయం

ధన్వాడ మండలం కంసాన్‌పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు.

Published : 29 Mar 2024 03:49 IST

కంసాన్‌పల్లి నర్సరీలో ఏర్పాటు చేసిన షేడ్‌నెట్

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌: ధన్వాడ మండలం కంసాన్‌పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. ఎండల తీవ్రత మూలంగా మొక్కలకు నీడ కల్పించేందుకు ఇటీవల పంచాయతీ షేడ్‌నెట్(నీడ కోసం పరదా)లను కొనుగోలు చేసింది. పదివేల మొక్కలకు రెండింటిని కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శులు ధర వెల్లడించడంలేదు కానీ ఒక్కొక్క నెట్కు రూ. మూడు వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన రెండింటికి కలిపి రూ. ఆరు వేలు ఖర్చు పెట్టారు. పరదాలను శాశ్వత ప్రతిపాదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి గాలులకే చిరిగిపోతూ పనికి రాకుండా పోతున్నాయి.\

ఉమ్మడి పాలమూరు జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన నర్సరీలకు షేడ్‌నెట్లను ఏర్పాటు చేయడం లేదు. తాత్కాలిక నెట్లను రెండు, మూడుసార్లు ఏర్పాటుచేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు.  ఉమ్మడిజిల్లాలో 1684 నర్సరీలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రతి చోటా పది వేల నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఇవి కాకుండా పాత మొక్కలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటి నీడ కోసం వెచ్చిస్తున్న ప్రజాధనం షేడ్‌నెట్ల పాలవుతోంది.. కొనేటప్పుడు నాణ్యత ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఏటా రూ. కోట్ల ఖర్చు

చిన్న పంచాయతీల్లో పదివేల వరకు మొక్కలు పెంచుతుండగా, పెద్ద పంచాయతీల్లో 20వేల వరకు మొక్కల్ని ఏర్పాటు చేశారు. ధన్వాడ మండలం కంసాన్‌పల్లిలో పెంచుతున్న పది వేల మొక్కకు రెండు షేడ్‌నెట్లు సరిపోలేదు. కనీసం మూడైనా కావాలి. 20వేల మొక్కలు పెంచుతున్న చోట అయిదు లేక అరైనా అవసరం పడుతుంది. ఈ లెక్కన ఒక్కొక్క నర్సరీకి ప్రతి ఏటా నీడ కోసం రూ. 18వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1684 నర్సరీలకు ఏటా రూ.3,03,12,000 వరకు ఖర్చవుతోంది. ఇంత మొత్తంలో పంచాయతీలు వెచ్చిస్తున్నా ఒనగూరిన ఫలితం ఏమీ ఉండటం లేదు.  ఈ ఏడాది కొనుగోలు చేసిన పరదాలు నర్సరీ గడువు తీరక ముందే చినిగిపోతున్నాయి. చిన్న పాటి ఈదురు గాలులు వస్తే అంతే సంగతి..ప్రైవేటు నర్సరీలో ఏర్పాటు చేసుకునే విధంగా శాశ్వత ప్రతిపాదికన షేడ్‌నెట్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నర్సరీల సంఖ్య

మహబూబ్‌నగర్‌  441
జోగులాంబ గద్వాల 255
నారాయణపేట 280
వనపర్తి  255
నాగర్‌కర్నూల్‌ 453

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు