logo

నైపుణ్యాభివృద్ధి.. యువతకు ఉపాధి

ఉద్యోగం లేదు.. ఉపాధీ కరవే. చదువుకున్న చాలా మందికి ఎదురవుతున్న పరిస్థితి.. ప్రస్తుతం ఉద్యోగాలు సాధించడం అంత సులువు కాదు. ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామన్నా అవకాశాలు దొరకని తీరు.

Published : 24 May 2022 02:33 IST

శిక్షణ, ఉద్యోగమేళాలతో నిరుద్యోగులకు బాసట

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ, సిద్దిపేట


అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తున్న అధికారులు

ఉద్యోగం లేదు.. ఉపాధీ కరవే. చదువుకున్న చాలా మందికి ఎదురవుతున్న పరిస్థితి.. ప్రస్తుతం ఉద్యోగాలు సాధించడం అంత సులువు కాదు. ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామన్నా అవకాశాలు దొరకని తీరు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువతకు చేయూతనిస్తున్నారు.. సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఆ వేదిక ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలకు బాటలు వేస్తున్నారు. ఇందుకోసం డీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ఉద్యోగ విభాగం ఉంది. ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తున్న తీరుపై తీరుపై కథనం.

డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం

యువతకు ఉపాధి మార్గాలు చూపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)లో ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌(ఈజీఎంఎం) విభాగాన్ని ఏర్పాటు చేసింది. నైపుణ్యాలు ఉంటేనే సంస్థ, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు పొందటం సులభమవుతుంది. అందుకే వివిధ అంశాల్లో ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నారు. ఇదంతా చేస్తూనే పరిశ్రమలు, సంస్థల్లో ఖాళీలపై వివరాలు సేకరిస్తున్నారు. ముందుకు వచ్చే పరిశ్రమలు, సంస్థలను ఆహ్వానించి ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నారు.

యాజమాన్యాలతో మాట్లాడుతూ.. పరిష్కరిస్తూ..

సంగారెడ్డి జిల్లాలో గత మూడు సంవత్సరాల్లో మొత్తం 20 ఉద్యోగ మేళాలు నిర్వహించారు. ఆయా మేళాల్లో 2,008 మంది ముఖాముఖీకి హాజరయ్యారు. ఇందులో 607 మంది పరిశ్రమలు, సంస్థల్లో అవకాశాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం 304 మంది ఉపాధి పొందుతున్నారు. ఎంపికైన వారిలో కొందరు తమ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాల్లో చేరలేదు. ఉద్యోగాల్లో చేరిన వారి గురించి కూడా డీఆర్డీఏ అధికారులు ఆరా తీస్తుంటారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత యాజమాన్యాలతో మాట్లాడుతూ పరిష్కారానికి కృషిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎంఆర్‌ఎఫ్‌, తోషిబా, మహీంద్ర తదితర పరిశ్రమలతోపాటు బీమా, రవాణా, మొబైల్‌ తదితర సంస్థల్లోనూ ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరుస్తున్నారు.

కొలువులో నిలదొక్కుకోవటం ముఖ్యం

ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. ఉద్యోగ మేళాల గణాంకాలు దీనినే సూచిస్తున్నాయి. ఉద్యోగ మేళా అనగానే పరుగెత్తుకుంటూ వస్తున్నవారు ఎక్కువ మంది ఉంటున్నారు. ముఖాముఖీలో నెగ్గుతున్న వారు సగం మంది కూడా ఉండటం లేదు. ఇందులో ఉత్తీర్ణులైనా కొందరు జీతం చాలదని, ఇంటికి దూరంగా వెళ్ళాల్సి వస్తుందన్న చిన్నచిన్న కారణాలతో చేరకుండా ఉంటూ అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారు. అవకాశాల్ని సద్వినియోగంచేసుకున్న వారు జీవితంలో స్థిరపడుతున్నారు.

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా.. : - అనిత, సంగారెడ్డి

పదో తరగతి వరకు చదివా. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంమాత్రంగా ఉండటంతో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న సమయంలో పత్రికా ప్రకటన చూసి ఉద్యోగ మేళాకు హాజరయ్యా. ముఖాముఖీలో ఎంపిక కావడంతో ఉపాధికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం కొండాపూర్‌ మండలం మల్లేపల్లిలోని మద్యం పరిశ్రమలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. పదో తరగతి అర్హతోనే ఉపాధి అవకాశం రావడం ఆనందంగా ఉంది.

సద్వినియోగం చేసుకోవాలి : - శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నాం. ముఖాముఖీలో ఎంపికైన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ పనిచేసేందుకైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే మంచి అవకాశాలు పొందటం సులభమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని