logo

రూ.కోట్లలో వ్యయం.. వసతులు మృగ్యం!

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. యువత, చిన్నారులను ఆటల వైపు మళ్లీంచి వారిని శారీరకంగా ధృడంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం.

Published : 30 Nov 2022 05:27 IST

క్రీడా ప్రాంగణాల దుస్థితి

నారాయణరావుపేటలో ఇలా..

న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. యువత, చిన్నారులను ఆటల వైపు మళ్లీంచి వారిని శారీరకంగా ధృడంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. క్షేత్రస్థాయిలో లక్ష్యం నీరుగారిపోతోంది. లెక్కలు చూపించేందుకే అన్నట్టుగా అనేకచోట్ల కేవలం బోర్డుల ఏర్పాటుతో పనులు ముగించారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ఉండగా 455లో క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం 422 పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు పూర్తయ్యాయి. చాలా గ్రామాల్లో అనుకూలంగా లేని స్థలాలను కేటాయించారు. వాటి ఏర్పాటుకు మొత్తం రూ.2.6 కోట్లు ఖర్చు చేశారు. ఎకరం స్థలంలో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో కోర్టులు వాటితో పాటు మూడు కోర్టులు లాంగ్‌ జంప్‌, వ్యాయామం చేసేందుకు ఒకటి, రెండు వరుసల లైన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల కేవలం రెండు, మూడు గుంటల భూమిలో చదును చేసి పరికరాలు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ రెండో దశ పరీక్షకు సాధన చేసేందుకు ఉపయోగ పడతాయనుకుంటే నిరాశ అవుతోంది.

కొనుగోలు కేంద్రాలుగా..

గ్రామీణ ప్రాంతాల్లో ఆయా క్రీడా ప్రాంగణాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మార్చారు. నారాయణరావుపేట మండలం కేంద్రంలో రూ.26 వేలు ఖర్చు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం అయింది. సిద్దిపేట గ్రామీణ మండలం పుల్లూరు ఉన్నత పాఠశాలలో రూ.42,464 ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినా వృథాగా ఉంది. అక్కడ పిచ్చిమొక్కలు పెరిగాయి. సిద్దిపేట గ్రామీణ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో తక్కువ స్థలంలో రూ.12,443 వ్యయంతో క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు. బెజ్జంకి మండలంలో 23 పంచాయతీలు ఉండగా 15 గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి చేసి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. నర్సింహులపల్లి, చీలాపూర్‌పల్లి, చీలాపూర్‌, ముత్తన్నపేట, దేవక్కపల్లి గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి కాలేదు. లక్ష్మీపూర్‌, వీరాపూర్‌, గూడెం గ్రామాల్లో స్థలాలు అనువుగా లేవు. సగానికి పైగా పంచాయతీల్లో బోర్డుల ఏర్పాటు మినహా మిగిలిన పనులు ముందుకు సాగడం లేదు. మైదానం చదును, క్రీడా సామగ్రి, ఇతర సదుపాయాల ఏర్పాటుకు పంచాయతీలే ఖర్చు భరించాల్సి ఉంది. తర్వాత ఉపాధిహామీ పథకం కింద అందజేస్తారు. పనుల ఒత్తిడి, ఆర్థిక భారంతో సర్పంచులు ఉత్సాహన్ని చూపలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పనులు చేపట్టిన పంచాయతీలకు బిల్లుల మంజూరే లేదు. సర్పంచులు, సిబ్బందితో మాట్లాడి క్రీడా వసతుల ఏర్పాటు, ఇతరత్రా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు