logo

విద్యారంగానికి పది శాతం పైగా నిధుల కేటాయింపు

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, బడ్జెట్‌లో 10 శాతం పైగా నిధులు కేటాయించి, వినియోగిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 03 Dec 2022 01:23 IST

ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

బ్యాటరీ ట్రైసైకిళ్ల వితరణ సందర్భంగా దివ్యాంగులతో మంత్రి హరీశ్‌రావు, తానా ప్రతినిధులు, అధికారులు

సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, బడ్జెట్‌లో 10 శాతం పైగా నిధులు కేటాయించి, వినియోగిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను రద్దు చేసిందని, రాష్ట్రం వాటి బాధ్యత తీసుకుంటోందన్నారు. సిద్దిపేటలో కొనసాగుతున్న జిల్లా స్థాయి ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే వైద్యవిద్య, అటవి, వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక, ఇతర విద్యా అనుబంధ సంస్థలపై ఏటా రూ.వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భావానికి ముందు విద్యారంగానికి ప్రతి సంవత్సరం రూ.9 వేల కోట్లు నిధులు వెచ్చిస్తే ప్రస్తుతం రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఎనిమిదో తరగతి మొదలు ఇంటర్‌ చదివే విద్యార్థినులకు హెల్త్‌ - హైజెనిక్‌, శానిటరీ కిట్ల పంపిణీని మరో 20 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. తద్వారా 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని వివరించారు.

తానా సహకారం

తానా సహకారంతో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, గ్రామాల్లో చదివే విద్యార్థినులకు సైకిళ్లు, ఇద్దరికి ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. సిద్దిపేట, ఇర్కోడు, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు, బెజ్జంకి ప్రాంతాలకు చెందిన ఆరుగురు దివ్యాంగులకు తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ఫౌండేషన్‌ సహకారంతో సుమారు ఇరవై మందికి అందజేశారు. తానా ప్రతినిధులు నిరంజన్‌, రవి, విశ్వనాథ్‌, సురేశ్‌, శ్రీనివాస్‌, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఆర్డీవో అనంతరెడ్డి, సుడా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, డీఈ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని