logo

పల్లెల్లో గెలిచి.. పదవులు వరించి

చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే వారికి గతంలో పాలనాపరంగా అనుభవం ఉంటే ప్రజలకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. గ్రామస్థాయిలో పరిపాలన కొనసాగించిన వారికి అన్ని అంశాలపై అవగాహన ఉండటంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు.

Updated : 06 Nov 2023 04:48 IST

న్యూస్‌టుడే,మెదక్‌, చేగుంట, వెల్దుర్తి

చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యే వారికి గతంలో పాలనాపరంగా అనుభవం ఉంటే ప్రజలకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. గ్రామస్థాయిలో పరిపాలన కొనసాగించిన వారికి అన్ని అంశాలపై అవగాహన ఉండటంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు. సర్పంచి, పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, జడ్పీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా ఆయా పదవుల్లో కొనసాగిన వారు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, ఎంపీలుగా ఎన్నికయ్యారు. వారికి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాసమస్యలపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడంతో పాటు, వారి తరఫున పోరాడే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం...


సీఎం సభను విజయవంతం చేయండి

నర్సాపూర్‌: ఈనెల 16న నర్సాపూర్‌లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభను జయప్రదం చేయాలని భారాస అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు నర్సాపూర్‌లో వెల్దుర్తి వెళ్లే మార్గంలోని ప్రాంతాలను సీఎం బహిరంగ సభ నిర్వహణకు ఆదివారం సాయంత్రం పరిశీలించారు.  నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.


వలస ఓటర్లపై వల

టేక్మాల్‌: ఎన్నికలు రాగానే గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లపై నాయకులు దృష్టి సారిస్తారు. టేక్మాల్‌ మండల పరిధిలోని సూరంపల్లి, కమ్మరికత్త, దాదాయిపల్లి, ఎల్లుపేట, కోరంపల్లి, ధనుర, తదితర గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి నివాసం ఉంటున్నారు. వారి వివరాలను, చరవాణి నంబర్లు సేకరించి ఆయా పార్టీల నాయకులు జాబితా రూపొందించారు. వారికి నాయకులు ఫోన్‌ చేసి తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రయాణ ఖర్చులు సైతం ఇస్తామని ఎర వేస్తున్నారు.


11 ఏళ్ల పాటు...

పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటకు చెందిన పట్లోళ్ల కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. 1970లో పట్లోళ్ల నారాయణరెడ్డి యూసుఫ్‌పేట సర్పంచిగా గెలుపొందారు. 11ఏళ్ల పాటు పనిచేశారు. పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి 1989లో మెదక్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 వరకు కొనసాగి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి జనతా పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..

చెరుకు ముత్యంరెడ్డి మొదట తొగుట సర్పంచిగా దాదాపు 18 ఏళ్లు పనిచేశారు. అనంతరం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999లో దొమ్మాట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో నాలుగో సారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెదేపా హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా, శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. సర్పంచి తర్వాత సహకార సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.


సర్పంచి నుంచి ఎమ్మెల్యేగా

పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన కరణం రామచందర్‌రావు. 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1966లో కొత్తపల్లి గ్రామానికి సర్పంచిగా పనిచేశారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తొలిసారే శాసనసభలో అడుగుపెట్టారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో తొలిసారి మంత్రి పదవి వరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో  మంబోజిపల్లిలో నిజాం చక్కెర కర్మాగారం, మెదక్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటైంది.


సర్పంచిగా 22 ఏళ్ల అనుభవం

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. మెదక్‌ జిల్లా మాసాయిపేటకు చెందిన ఆయన యువజన సంఘం అధ్యక్షుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1986, 1994లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1959 నుంచి 1981 వరకు మాసాయిపేట సర్పంచిగా కొనసాగారు. 1981 నుంచి 1986 వరకు రామాయంపేట సమితి అధ్యక్షుడిగా వ్యవహరించాను. సర్పంచిగా 22ఏళ్లు, సమితి అధ్యక్షునిగా అయిదేళ్లు, ఎమ్మెల్యేగా రెండు దఫాలు పదవులు చేపట్టిన అనుభవంఆయనది.


వార్డు సభ్యుడిగా గెలిచి..

చేగుంట మండలం పొలంపల్లికి చెందిన రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి(ఆర్‌ఎస్‌ వాసురెడ్డి) మొదట చేగుంట ఉప సర్పంచిగా పనిచేశారు. గతంలో పొలంపల్లి చేగుంట మదిర గ్రామంగా ఉండేది. అక్కడ వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చేగుంట ఉప సర్పంచిగా ఎన్నికయ్యారు. 1985లో రామాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశారు.


మండలం ఒకటి..  ఓటు వేసేది మరోటి

తూప్రాన్‌, మనోహరాబాద్‌: గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ మండలం పరికిబండ, పోతారం గౌతోజి గూడెం మూడు గ్రామాల ప్రజలు నర్సాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థులకు ఓటు వేయనున్నారు. మూడు గ్రామాలు గతంలో శివ్వంపేట మండలంలో ఉండగా, గ్రామపంచాయతీలు ఏర్పాటు సమయంలో మనోహరాబాద్‌ మండలంలోకి కలిపారు. ఈ మూడు గ్రామాల ప్రజలు పేరుకు గజ్వేల్‌ నియోజకవర్గంలో ఉన్నా  ఓటు మాత్రం నర్సాపూర్‌ నియోజకవర్గంలో ప్రాతినిథ్యం వహించే అభ్యర్థులకు వేయనున్నారు. ఈ మూడు గ్రామాల్లో గజ్వేల్‌ నియోజకవర్గ నాయకులతో పాటు నర్సాపూర్‌ నియోజకవర్గ నాయకులు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఎమ్మెల్యే పేరుతో కాలనీ

నర్సాపూర్‌: ప్రజాప్రతినిధులు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రజలు వారిపై అభిమానం చాటుతారు. నర్సాపూర్‌ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చౌటి జగన్నాథరావు పేరు మీద నర్సాపూర్‌లో ఓ కాలనీ ఉంది. నర్సాపూర్‌కు చెందిన జగన్నాథరావు 1980లో అంజయ్య మంత్రివర్గంలో ఆబ్కారీ మంత్రిగా పనిచేశారు. 1982లో భవనం వెంకట్రాంరెడ్డి మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదే సమయంలో ఆయన ఇక్కడ వంద మందికి పైగా ఇళ్లు లేని  పేదలకు ప్రభుత్వం నుంచి అసైన్డు భూములను కేటాయించారు. స్థలాలు పొందిన పేదలు ప్రభుత్వ సహకారంతో అప్పట్లో పక్కా ఇళ్లను నిర్మించుకున్నారు. జగన్నాథరావు హయాంలో ఈ కాలనీ ఏర్పాటు కావడంతో ఆయన పేరు పెట్టారు. దీన్ని ఆనుకొని మాజీ మంత్రి సునీతారెడ్డి పేరుతో కూడా ఓ కాలనీ ఏర్పాటైంది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రెండొందల మందికి పైగా పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు. వారు సొంత ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని