logo

అత్యధికులు పట్టభద్రులే!

శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పట్టభద్రులే ఉన్నారు. వీరిలో అధికులు కోటీశ్వరులు కావడం గమనార్హం. చదువుకున్న వారు రాజకీయాలపై ఆసక్తి చూపడమే కాకుండా, రాణిస్తున్న సందర్భాలు అధికంగానే ఉన్నాయి.

Updated : 14 Nov 2023 06:23 IST

జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థుల విద్యా నేపథ్యం

శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పట్టభద్రులే ఉన్నారు. వీరిలో అధికులు కోటీశ్వరులు కావడం గమనార్హం. చదువుకున్న వారు రాజకీయాలపై ఆసక్తి చూపడమే కాకుండా, రాణిస్తున్న సందర్భాలు అధికంగానే ఉన్నాయి. జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల విద్యా నేపథ్యం, అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు, నేర చరితపై కథనం.

- న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, జోగిపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జిన్నారం.

వైద్య, న్యాయ వృత్తి నుంచి..

నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి ఎంబీబీఎస్‌, డిప్లొమా ఇన్‌ చైల్డ్‌హెల్త్‌(డీసీˆహెచ్‌) చదువుకున్నారు. ఖేడ్‌ భాజపా అభ్యర్థి జన్‌వాడే సంగప్ప పీˆజీ(ఎంసీˆజే) పూర్తి చేశారు. సంగారెడ్డిలో బహుజన రిపబ్లికన్‌ సోషలిస్ట్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మ్యాతరి మనోహర్‌ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. సంగారెడ్డి నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పి.బాపురెడ్డి బీఏ, ఎల్‌ఎల్‌ఎం, కోవూరి సత్యనారాయణ గౌడ్‌ ఎంఏ, కొల్కూర్‌ ప్రతాప్‌ ఎంబీ బీఈడీ పూర్తి చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డి పదో తరగతి, భారాస అభ్యర్థి చింతా ప్రభాకర్‌ పది, భాజపా అభ్యర్థి పులిమామిడి రాజు పది వరకు చదివారు. అందోలు కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర రాజనరసింహ బీటెక్‌(సివిల్‌ ఇంజినీరింగ్‌) పూర్తి చేశారు. అందోలు భాజపా అభ్యర్థి, సినీ నటుడు పల్లి బాబూమోహన్‌ బీఏ చదివారు. అందోలు భారాస అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. నారాయణఖేడ్‌ భారాస అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి బీఎస్సీ పూర్తి చేశారు. జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ బీఎస్సీ పూర్తి చేసి కొంతకాలం పశువైద్యాధికారిగా పనిచేశారు.  జహీరాబాద్‌ భారాస అభ్యర్థి కె.మాణిక్‌రావు ఇంజినీరింగ్‌ చదివి ఆర్టీఓగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు.

కోటీశ్వరులూ ఎక్కువే..

నామినేషన్ల సమయంలో పేర్కొన్న అఫిడవిట్ల ప్రకారం జిల్లాలో సంగారెడ్డి భాజపా అభ్యర్థి పులిమామిడి రాజుకు ఎక్కువ ఆస్తులు (స్థిర, చరాస్తులు) ఉన్నాయి. జిల్లాలోని అయిదు నియోజకవర్గాల పరిధిలో 13 మంది అభ్యర్థులు కోటీశ్వరులు కావడం గమనార్హం.

కొందరిపై పోలీసు కేసులు

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. ఖేడ్‌ భారాస అభ్యర్థి భూపాల్‌రెడ్డిపై రెండు, ఖేడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవరెడ్డిపై మూడు, ఖేడ్‌ భాజపా అభ్యర్థి సంగప్పపై రెండు, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌పై నాలుగు కేసులున్నాయి.

వీరికి అప్పులు లేవు

జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా అప్పులు లేనివారు ముగ్గురున్నారు. జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్‌, బాబూమోహన్‌లకు అప్పులు లేనట్లు ఎన్నికల అఫిడవిట్లలో చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని