logo

కొత్తగా వచ్చింది ఇద్దరు స్థిరత్వం చూపింది ఇద్దరు

సిద్దిపేట జిల్లాలో కేసీఆర్‌, హరీశ్‌రావు తమ గెలుపును మరోసారి స్థిరం చేసుకోగా... కొత్త ప్రభాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ మొదటిసారి విజయం వరించి వచ్చారు. శాసనసభా ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేటలో భారాస అభ్యర్థి హరీశ్‌రావు చక్కటి మెజార్టీని కైవసం చేసుకున్నారు.

Updated : 04 Dec 2023 06:04 IST

సిద్దిపేట ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫలితాల అనంతరం కొత్త ప్రభాకర్‌ రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌

సిద్దిపేట జిల్లాలో కేసీఆర్‌, హరీశ్‌రావు తమ గెలుపును మరోసారి స్థిరం చేసుకోగా... కొత్త ప్రభాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ మొదటిసారి విజయం వరించి వచ్చారు. శాసనసభా ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేటలో భారాస అభ్యర్థి హరీశ్‌రావు చక్కటి మెజార్టీని కైవసం చేసుకున్నారు. గజ్వేల్‌లో కొంత ఆధిక్యం తగ్గినా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ గెలుపు జాబితాలో చేరారు. మెదక్‌ ఎంపీగా సేవలందిస్తూనే కొత్త ప్రభాకర్‌రెడ్డి.. దుబ్బాకలో జరిగిన పోటీలో సత్తా చాటారు. పొన్నం ప్రభాకర్‌ మాత్రం హుస్నాబాద్‌లో వొడితల సతీశ్‌కుమార్‌ హ్యాట్రిక్‌ కలకు గండి కొట్టారు. రాజకీయ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.


‘హరీశ్‌’మయం

ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్‌రావు తరఫున భారాస ఏజెంటు మోహన్‌లాల్‌, నాయకుడు పాల సాయిరాంకు ధ్రువపత్రాన్ని అందిస్తున్న రిటర్నింగ్‌ అధికారి రమేశ్‌బాబు - న్యూస్‌టుడే, సిద్దిపేట, గజ్వేల్‌

న్యూస్‌టుడే, సిద్దిపేట, అర్బన్‌, టౌన్‌, చిన్నకోడూరు, నంగునూరు: సిద్దిపేటలో తన్నీరు హరీశ్‌రావు గెలవగా మిగిలిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధరావతు (డిపాజిట్‌) దక్కలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 1,81,834 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో భారాస నుంచి హరీశ్‌రావు - 1,05,515, కాంగ్రెస్‌ అభ్యర్థి పూజల హరికృష్ణ - 23,206, భాజపా అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి - 23,201, బీఎస్పీ అభ్యర్థి చక్రధర్‌- 16,610 ఓట్లు పొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస అభ్యర్థి హరికృష్ణపై హరీశ్‌.. 82,308 ఓట్లతో ఘన విజయం సాధించారు. కాగా గత ఎన్నికల్లో హరీశ్‌రావు 1,18,699 ఓట్ల మెజార్టీని పొందారు. గతంతో పోల్చితే ఈసారి 36,391 ఓట్లు తగ్గాయి. 2018 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌, భాజపా, బీఎస్పీ పార్టీలు నియోజకవర్గంలో పుంజుకున్నాయి. నాడు కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా తెజస అభ్యర్థి భవానిరెడ్డి బరిలో నిలవగా సమీప ప్రత్యర్థిగా ఆమె 12,596 ఓట్లు పొందారు. తరువాతి స్థానంలో భాజపా 11,266, బీఎస్పీ అభ్యర్థులు 718 ఓట్లు ఖాతాలో వేసుకున్నారు. అప్పట్లో కూడా భారాస ప్రత్యర్థులకు ఎవరికి డిపాజిట్‌ దక్కలేదు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ సమీప ప్రత్యర్థిగా నిలిచింది. భాజపా తన ప్రభావాన్ని చాటింది. హస్తం, కమలం పార్టీల మధ్య 5 ఓట్లు మాత్రమే తేడాగా ఉంది. ఇక బీఎస్పీ అభ్యర్థి గతంతో పోల్చితే 15,892 అధికంగా ఓట్లు సాధించడం గమనార్హం.


తగ్గినా.. హ్యాట్రిక్‌

ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్‌ తరఫున ధ్రువీకరణ పత్రాన్ని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డికి అందిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అదనపు కలెక్టర్లు

గజ్వేల్‌: గజ్వేల్‌లో 2014లో మొత్తం 86,694 ఓట్లుసాధించిన కేసీఆర్‌ 19,391 మెజారిటీతో గెలుపొందారు. 2018లో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పోటీ చేసిన ఆయనకు 125444 ఓట్లు రాగా 58290  మెజారిటీతో గెలిచారిఉ.రెండోసారి గజ్వేల్‌ నుంచి పోటీ చేసి ఇప్పుడు 111684 ఓట్లు వచ్చాయి. 45031 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతం కంటే 13259 మెజారిటీ తగ్గింది. 2009లో  కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సారెడ్డికి 74443 ఓట్లు వచ్చాయి. 7175 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో  పోటీ చేసిన నర్సారెడ్డికి  34085 ఓట్లు వచ్చాయి. కేసీఆర్‌ చేతిలో ఓడారు.ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు 32568 ఓట్లు వచ్చాయి.


హుస్నాబాద్‌కు మకాం మార్చి..

పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్న హుస్నాబాద్‌ విజేత పొన్నం ప్రభాకర్‌, ఆర్‌ఓ బెన్‌షాలోమ్‌ ఇతర అధికారులు

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఘన విజయం సాధించారు. ఆయన భారాస అభ్యర్థి, శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్‌పై 19,344 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ స్థానానికి మొత్తం 19మంది అభ్యర్ధులు రంగంలో ఉండగా ప్రధానంగా కాంగ్రెస్‌, భారాస మధ్యనే పోటీ జరిగింది. ఎన్నికల్లో మొత్తం ఓట్లు 205017  పోల్‌ అయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రభాకర్‌కు 99,769ఓట్లు రాగా, భారాస అభ్యర్థి సతీశ్‌కుమార్‌కు 81291 ఓట్లు లభించాయి. భాజపా అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తికి 8338 ఓట్లు వచ్చాయి. మూణ్నెల్ల క్రితం హుస్నాబాద్‌కు ప్రభాకర్‌ మకాం మార్చారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రధానంగా మెట్టప్రాంతానికి సాగునీరందించే గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి రిజర్వాయర్లను కాంగ్రెస్‌ హయాంలో 2007లో శంకుస్థాపన చేసినా ఇంతవరకు పూర్తి చేయలేదని ప్రధానంగా ప్రచారం చేశారు. మాజీ శాసనసభ్యుడు ప్రవీణ్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలసి ప్రచారం నిర్వహించడం ఇరుపార్టీలో ఐక్యత కన్పించింది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ సభకు భారీగా జనం తరలిరావడం, పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ వైద్య కళాశాల ప్రకటించడం ఆకట్టుకుంది. 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్‌, ప్రజాకూటమి సీపీఐ అభ్యర్థి చాడ వెంకటరెడ్డిపై 70,530 మెజారిటితో విజయం సాధించారు. 2014 లో  వొడితల సతీశ్‌కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిపై 34,269 ఓట్లతో విజయం సాధించారు.


ఉప ఎన్నిక ప్రభావం నిల్‌

చేగుంట: దుబ్బాకలో భాజపా, కాంగ్రెస్‌ ప్రభావం చూపలేకపోయాయి. మొత్తం 11 మంది రంగంలో ఉన్నారు. మొత్తం ఓట్లు 1,98,100. ఇందులో పోలైనవి 1,74,834 ఓట్లు. భారాస అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 97,879, భాజపా అభ్యర్ధి రఘునందన్‌రావుకు 44,366, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి 25,235 ఓట్లు వచ్చాయి.భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు 2018లో 22,595 ఓట్లు వచ్చాయి.నాడు రామలింగారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిని  62,421 మెజారిటీతో ఓడించారు. 2020 ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 63,352 ఓట్లు వచ్చాయి.2020తో పోల్చితే ఇప్పుడు రఘునందన్‌రావుకు 18,966 ఓట్లు తక్కువగా వచ్చాయి.

సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను లెక్కించారు. అనంతరం ఈవీఎంలవి చేపట్టారు. ఎన్నికల సిబ్బంది ఆదివారం తెల్లవారుజాము నుంచే విధుల్లో చేరారు. అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా పూర్తయింది.

న్యూస్‌టుడే, సిద్దిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు