logo

జిల్లాకు రెండు కార్పొరేషన్‌ పదవులు

రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు  చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. పార్టీ ఉన్నతికి చేసిన సేవలకు గుర్తింపు దక్కిందని నియామకమైన నేతలు అభిప్రాయపడుతున్నారు.

Updated : 18 Mar 2024 06:08 IST

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు  చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. పార్టీ ఉన్నతికి చేసిన సేవలకు గుర్తింపు దక్కిందని నియామకమైన నేతలు అభిప్రాయపడుతున్నారు.

టీఎస్‌ఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నిర్మలారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మలారెడ్డికి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఛైర్‌పర్సన్‌ పదవి దక్కింది. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ ఆమె జిల్లా అధ్యక్షురాలిగా సేవలందించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేశారు. ఆమె భర్త తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. జగ్గారెడ్డికి ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి దక్కుతుందని కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. తాజాగా నిర్మలారెడ్డికి నామినేటెడ్‌ పదవి దక్కింది. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని నిర్మలారెడ్డి తెలిపారు. పారిశ్రామికపరంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

ఫిలిం డెవలప్‌మెంట్‌ సంస్థ ఛైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి

జహీరాబాద్‌ అర్బన్‌, జహీరాబాద్‌, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ ఎంపీపీ ఎన్‌.గిరిధర్‌రెడ్డిని రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లికి చెందిన నందారం గిరిధర్‌రెడ్డి 2019లో కాంగ్రెస్‌ తరఫున ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓటమి పాలైనప్పటికీ.. మాజీ మంత్రి గీతారెడ్డితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగారు. ఆయన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి తోడల్లుడు కావడం.. సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది. ఆదివారం గిరిధర్‌రెడ్డిని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని