logo

ఓటు వజ్రాయుధం నమోదుకిదే తరుణం

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. రాజ్యాంగం ప్రజల చేతిలో పెట్టిన వజ్రాయుధం ఇది. సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు సామాన్యుడి చేతిలో తిరుగులేని అస్త్రంగా మారుతుంది.

Updated : 19 Mar 2024 05:49 IST

ఏప్రిల్‌ 15 వరకు గడువు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. రాజ్యాంగం ప్రజల చేతిలో పెట్టిన వజ్రాయుధం ఇది. సరైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు సామాన్యుడి చేతిలో తిరుగులేని అస్త్రంగా మారుతుంది. సమర్థుల ఎన్నికతో తమ తలరాతలు మారుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచిస్తోంది. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంది.

అంతర్జాలంలో అవకాశం..

ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని పరిపుష్ఠం చేస్తుంది. పారదర్శకంగా వినియోగించుకుంటే.. బంగారు భవితకు బాటలు వేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని  ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఓటరుగా నమోదయ్యే అవకాశం కల్పిస్తోంది. గత నెల వరకు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు నిర్వహించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా జనవరి 6న ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నూతన నమోదు సహా మార్పులు, చేర్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటూ కల్పించారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. దీంతో పెద్దమొత్తంలో దరఖాస్తులు సమర్పించారు. అయినప్పటికి మరో మారు ఓటరు జాబితాలో పేరు లేని వారు, కొత్తగా నమోదు చేసుకునే వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. అందుకు ఫారం-6ని పూరించి ఆన్‌లైన్‌లో లేదా బీఎల్‌వో, తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లోhttps:///nvsp.in, https:/// ceotelangana.nic.in, https:///voters.eci.gov.in/ పోర్టల్‌ లేదా చరవాణిలో voter help app (vha) ద్వారా నమోదుకు అవకాశం కల్పించారు.


సంగారెడ్డి, అందోలులో మహిళలే అధికం

2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 15.27 లక్షలు. 13 ఏళ్ల వ్యవధిలో ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఫిబ్రవరి 8న విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 14,18,688. అందులో పురుష ఓటర్లు 7,11,011, మహిళలు 7,07,538, ఇతరులు 139 మంది ఉన్నారు. సంఖ్యాపరంగా జిల్లా వ్యాప్తంగా పురుషులదే పైచేయి. సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లో మాత్రం పురుషులతో పోల్చితే మహిళలు అధికంగా ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని