logo

జోరుగా జూదం.. జీవితాలు ఛిద్రం

ప్రభుత్వం నిషేధించిన జూదం జిల్లాలో జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లోని క్లబ్‌లకు వెళ్లిన జూదరులు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనే మకాం వేస్తున్నారు.

Published : 16 Apr 2024 01:22 IST

మూడు నెలల్లోనే 24 స్థావరాలపై దాడులు.. 78 మంది అరెస్టు

న్యూస్‌టుడే, చేర్యాల: ప్రభుత్వం నిషేధించిన జూదం జిల్లాలో జోరుగా సాగుతోంది. గతంలో పట్టణాల్లోని క్లబ్‌లకు వెళ్లిన జూదరులు ఇప్పుడు మారుమూల పల్లెల్లోనే మకాం వేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరు యువకులు, గ్రామాల్లోని అమాయకులకు ఎరవేసి ఇందులోకి లాగుతున్నారు. కొంతకాలంగా పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో పట్టుబడిన వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

గుట్టలు, చెట్ల పొదలే స్థావరాలు

నివాసాలతో పాటు జనసంచారం తక్కవగా ఉండే గుట్టలు, గుబురుగా ఉండే చెట్ల పొదలే జూదానికి ప్రధాన అడ్డాలవుతున్నాయి. వాగుల పక్కన ఉన్న చిన్నపాటి అడవులు, రైతులు పెంచుతున్న తోటల్లోనూ ఆడుతున్నారు. పోలీసులు వస్తున్నప్పుడు సమాచారం ఇవ్వడానికి కొందరిని కాపలాగా పెట్టుకుంటున్నారు. వారికి సుమారు రూ.5 వేల వరకు ఇస్తుంటారు. జూదమాట నిర్వహణే ఉపాధిగా కొందరు మలుచుకున్నారు. రహస్య అడ్డాలు ఏర్పాటు చేసి, ఫోన్‌లు చేసి ఆటగాళ్లను రప్పించినందుకు ఒక్కో ఆటకు రూ.1 వేయి నుంచి రూ.3 వేల వరకు నిర్వాహకులు తీసుకుంటున్నారు.

క్లబ్‌ తరహాలో టోకెన్ల విధానం

పట్టణాలు, నగరాల్లోని క్లబ్బుల మాదిరిగా పల్లెల్లోనూ నిర్వాహకులు డబ్బు డిపాజిట్‌ చేసిన వారికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇటీవల చేర్యాల మండలం చుంచనకోట గుట్టల్లో పోలీసులు దాడి చేసినపుడు కాయిన్లు దొరకడం ఇందుకు నిదర్శనం. జూదంలో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు... యువత, విద్యార్థులు మాత్రం రూ.500 నుంచి రూ.5000 వరకు ఆటలో పణంగా పెడుతున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఇళ్లల్లోనే ఆడుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుంటున్నారు.

ఓవైపు కౌన్సిలింగ్‌.. మరోవైపు కఠిన చర్యలు

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు కాగా రూ.4,45,212 నగదు స్వాధీనం చేసుకున్నారు. కొందరు పరారీలో ఉండగా 78 మందిని అరెస్టు చేశారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న జూదం నియంత్రించాలంటే కౌన్సిలింగ్‌ చేయాలి. కఠిన చర్యలు, శిక్షల ద్వారా కట్టడి చేయాలి. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాడులతో కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి.


కొన్ని సంఘటనలు

  • మార్చి 20న చుంచనకోట శివారు మామిడి తోటలో హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆడారు. దాడులతో పారిపోయారు. రూ.10 వేల టోకెన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దూరులో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేశారు.
  • మార్చి 21న సిద్దిపేట గ్రామీణ ఠాణా పరిధి బంజేరుపల్లి శివారులో చెట్ల మధ్య ఆడుతున్న ఏడుగురు పట్టుబడ్డారు.
  • మార్చి 26న సిద్దిపేట టూటౌన్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌, పోలీసుల దాడిలో ఏడుగురు అరెస్టయ్యారు.
  • ఏప్రిల్‌ 7న సిద్దిపేట వన్‌టౌన్‌ పరిధిలోని   కంచర్‌ బజార్‌లోని ఓ ఇంట్లో జూదం ఆడుతూ ఆరుగురు దొరికారు.
  • చేర్యాల పట్టణం 4వ వార్డులో ఈనెల 10న ప్రైవేటు క్లినిక్‌లో సోదాలు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
  • ఈ సంఘటనల్లో మొత్తం రూ.1,16,187 నగదు, 35 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం ఇవ్వండి, చర్యలు తీసుకుంటాం

-అనూరాధ, సీపీ

తక్కువ సమయంలో, ఏమీ కష్టపడకుండానే ఎక్కువ సంపాదించవచ్చన్న దురాశే కుటుంబాల ఛిన్నాభిన్నానికి కారణమవుతోంది. జూదం నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ‘టాస్క్‌ఫోర్స్‌’ని ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. ఎక్కడైనా జూదం ఆడుతున్నా.. అనుమతి లేకుండా ఇసుక, రేషన్‌ బియ్యం రవాణా చేసినట్టు ఎవరికైనా తెలిస్తే ఫోన్‌ చేసి చెప్పండి. చర్యలు తీసుకుంటాం. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌ అధికారుల ఫోన్‌ నంబర్లు 87126 67445, 87126 67446, 87126 67447. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని