logo

పావులు కదిపిన కాంగ్రెస్‌

పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ‘కారు’ దిగి ‘చేయి’ అందుకోవడంతో నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Published : 16 Apr 2024 01:53 IST

మదన్‌రెడ్డి చేరికతో మారనున్న సమీకరణాలు

మెదక్‌, నర్సాపూర్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ‘కారు’ దిగి ‘చేయి’ అందుకోవడంతో నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో భారాస పార్టీ పట్టు సడలకుండా ప్రయత్నాలు చేస్తుండగా, మదన్‌రెడ్డి రాకతో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. గత కొంతకాలం నుంచి మదన్‌రెడ్డి భారాసను వీడనున్నారనే ప్రచారానికి సోమవారం ఆయన చేరికతో తెరపడింది. అనుచరులతో భారీ ర్యాలీగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వెళ్లి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. కౌడిపల్లికి చెందిన మదన్‌రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అత్యధిక ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు భారాసకు చెందిన వారే. నర్సాపూర్‌ పురపాలికను సైతం భారాస గెలుచుకోవడంలో కృషి చేశారు. నియోజకవర్గ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ముద్ర వేసుకున్నారు.

సునీతారెడ్డి రాకతో

కాంగ్రెస్‌ నుంచి సునీతారెడ్డి భారాసలో చేరడంతో ఆయన తిరోగమనం ప్రారంభమైంది. అప్పటి వరకు ఏకతాటిపై ఉన్న భారాస రెండు వర్గాలుగా కొనసాగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మదన్‌రెడ్డికి కాకుండా సునీతారెడ్డికి టికెట్‌ ఇచ్చారు. దీంతో ఆమె పార్టీ క్యాడర్‌ను తనకు అనుకూలంగా మరల్చుకోవడం, పార్టీపై పట్టు సాధించారు. దీంతో పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోతుందని మదన్‌రెడ్డి భావించినా, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటంతో పార్టీని వీడే ఆలోచన చేయలేదు. ఆతర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని హామీ ఇవ్వడంతో సునీతారెడ్డి విజయానికి కృషి చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ టికెట్‌ దక్కకపోవడంతో ఇక భారాసలో కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని పార్టీని వీడే ఆలోచన చేశారు.  

లాభనష్టం ఎవరికి

మదన్‌రెడ్డి చేరికతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంచనాల్లో ఇరు పార్టీలు మునిగిపోయాయి. మదన్‌రెడ్డి చేరడంతో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు కలిసి వస్తుందా? అనే విషయంలో ఆసక్తికర చర్చలు కొనసాగిస్తున్నారు.  రాజకీయాల పట్ల అవగాహన, అనుభవం ఉన్న నేత పార్టీలో చేరడం కాంగ్రెస్‌ విజయానికి అనుకూలిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ముందస్తు చర్యలు

జిల్లాలోని పలువురు నేతలు భారాసను వీడటంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ బలం పుంజుకోనుందని అంటున్నారు. మదన్‌రెడ్డి వెంట పార్టీ నేతలు వెళ్లకుండా మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డిలు ముందస్తుగా ముఖ్యనేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో ఫోన్లలో సంప్రదించారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. నర్సాపూర్‌లో ఆదివారం రాత్రి వీరు ముఖ్యనేతలతో సమావేశమై భారాసను వీడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ సభ విజయవంతానికి ఈ సమావేశం నిర్వహించామని చెప్పినా అందులో మదన్‌రెడ్డి చుట్టే చర్చలు జరిగాయి. మదన్‌రెడ్డి వెన్నంటి ఉండే ముఖ్యనేతల్ని పార్టీ వీడకుండా చేయడంలో కృతకృత్యులయ్యారు.  

పార్టీ మారిన నేతలు

మెదక్‌ పురపాలిక ఛైర్మన్‌ చంద్రపాల్‌తో పాటు మరో తొమ్మిది కౌన్సిలర్లు, ఒక కో-ఆప్షన్‌ సభ్యులు భారాసను వీడారు. నర్సాపూర్‌ వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు రాజుయాదవ్‌, ఏఎంసీ మాజీ వైస్‌ఛైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, మాజీ ఎంపీపీ లలిత, చిప్పల్‌తుర్తి, నాగులపల్లి ఎంపీటీసీలు సంధ్యారాణి నాయక్‌, మేఘమాల, నేతలు కవితారెడ్డి, మల్లేశ్‌యాదవ్‌, రవిగౌడ్‌, నవీన్‌యాదవ్‌, కౌడిపల్లి మాజీ ఎంపీపీ పద్మ, నర్సింహరెడ్డి, మహ్మద్‌నగర్‌ ప్యాక్స్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చిన్నంరెడ్డి, కౌడిపల్లి మాజీ సర్పంచి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ మంజుల, మహ్మద్‌గనర్‌ ఎంపీటీసీ సునీత, తిమ్మాపూర్‌, రాయిలాపూర్‌, వెంకట్రావుపేట, రాజిపేట, తునికి గ్రామాల మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. వెల్దుర్తి మాజీ జడ్పీటీసీ ఆముద ఆంజనేయులు, దామరంచ మాజీ సర్పంచి విజయభాస్కర్‌రెడ్డి చేరారు. శివ్వంపేట ప్యాక్స్‌ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, నేతలు ఆనంద్‌, గంగాధర్‌, సోని, రవినాయక్‌, కొల్చారం మండలం నుంచి ఎంపీటీసీ అరుణ, కృష్ణాగౌడ్‌, అప్పాజిపల్లి, రంగంపేట, పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్‌లు ఉన్నారు.


అవమానభారంతో భారాసను వీడాను

-మదన్‌రెడ్డి

సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో సునీతారెడ్డికి టికెట్‌ ఇచ్చి తనను అవమానించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఊరూరా ప్రచారం చేశారు. సిద్దిపేట నుంచి లక్ష మెజార్టీ ఇస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. తీరా ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషిచేస్తే డబ్బులు తీసుకుని పనిచేశారనే అపవాదును తనపై మోపారు. ఇలా భారాసలో అడుగడుగునా అవమానించడం, మోసగించడంతోనే ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా లాంటి సీనియర్‌ నేతను, నిస్వార్థపరుడిని వదులుకోవడం ఆ పార్టీకి నష్టమే. మాజీ సీఎం కేసీఆర్‌తో ఉన్న సంబంధాల వల్ల ఆ పార్టీని వదలడం బాధగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని