logo

త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి.

Updated : 24 Apr 2024 07:04 IST

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఏళ్ల కిందట వేలాది కుటుంబాలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డాయి. దీంతో అక్కడి సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో త్రిలింగ ప్రాంతంగా నారాయణఖేడ్‌ను పిలుస్తారు. నారాయణఖేడ్‌ ప్రాంతంలో అత్యధికల వస్త్రధారణ సైతం భిన్నంగా ఉంటుంది. వృద్ధులు తలకు పట్కాలు, మరికొందరు తెల్లటి టోపీలు ధరిస్తారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం మెడలో తులసీ మాలలు ధరించి నుదుట నల్లటి నామం పెట్టుకుంటారు. ఇక్కడి జనాభాలో 80 శాతం మంది తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ మాట్లాడుతారు. గిరిజనులు గోర్‌బోలీ భాషలో మాట్లాడుతుంటారు. నిజాంల పాలనలో ప్రస్తుత నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లోని పలు మండలాలు కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలో, మరికొన్ని మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉండేవి. నాగల్‌గిద్ద మండలంలోని పలు గ్రామాల్లో కన్నడ మాధ్యమ పాఠశాలలూ ఉన్నాయి. ఏటా దిండి యాత్ర చేపట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కన్నడ భజన మండళ్లు సైతం కొనసాగుతున్నాయి.

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌


వెతికి మరీ రప్పించేందుకు..

ప్రచార పర్వం తెరపైకి వచ్చింది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో పార్టీల అగ్రనాయకులు ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. సభలు, రోడ్‌ షోల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. తద్వారా ఓట్లు ఒడిసి పట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గత శాసనసభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఆయా పార్టీల నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. గెలుపుపై ఆశతో ఉన్న అభ్యర్థులు, వారి తరఫున బాధ్యతలు తీసుకున్న ఆయా పార్టీల నియోజకవర్గ బాధ్యులు ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని గ్రామాల్లో, పట్టణాల్లో స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిపై దృష్టిసారించారు. బంధువులు, స్నేహితులు, ఇంటి పొరుగున ఉన్న వారి ద్వారా వారి ఫోన్‌ నంబర్లు సేకరించి వారితో మాట కలుపుతున్నారు. ఇందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యేక బృందాలను నియమించుకోవడం గమనార్హం. ఇప్పటికే వారంతా ఫోన్‌ నంబర్లు సేకరించే పనిలో ఉన్నారు. మే 13 (పోలింగ్‌ తేదీ)కు ఓ రోజు ముందుగానే గ్రామాలకు వచ్చేలా రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. గ్రామాల్లో వలస ఓటర్ల వివరాలు సేకరించాలని కింది స్థాయి నాయకులను సూచించారు.
- న్యూస్‌టుడే, పాపన్నపేట


జిల్లా 1.. ఎంపీ స్థానాలు 3

ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకటి, రెండు ఎంపీ స్థానాలే ఉండగా.. ఒక్క సిద్దిపేటలో మాత్రం మూడు ఎంపీ స్థానాల పరిధిలు ఉండటం గమనార్హం. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్‌ కిందికి వస్తాయి.
 పునర్విభజనలో భాగంగా జిల్లాలో కలిసిన హుస్నాబాద్‌ మూడు ముక్కలుగా వీడి మూడు జిల్లాల్లో విలీనమైంది. హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట మండలాలు సిద్దిపేట, సైదాపూర్‌, చిగురుమామిడి మండలాలు కరీంనగర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలు హన్మకొండ జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ఈ నియోజకవర్గం కరీంనగర్‌ ఎంపీ స్థానం పరిధిలో కొనసాగుతోంది.
 ఇక చేర్యాల, కొమురవెల్లి, ధూల్మిట్ట, మద్దూరు మండలాలు జనగామ అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తాయి. ఇవన్నీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్నాయి. 

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని