logo

జన గణనకు కసరత్తు

పదేళ్లకోసారి చేపట్టే జన గణనకు మరో అడుగు పడింది. ఇప్పటికే వివిధ ప్రక్రియలు పూర్తికాగా.. లెక్కింపునకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణపై ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏప్రిల్‌ నుంచి జనాభా లెక్కింపు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు అవసరమైన రెవెన్యూ, సరిహద్దుల నిర్ధారణకు ఉమ్మడి జిల్లాల అధికారులు నడుం బిగించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికనే వివరాలు సేకరించేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. 2020లోనే జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం జన గణన చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

Published : 22 Jan 2022 03:42 IST

పంచాయతీలు, పురపాలిక వార్డుల సరిహద్దుల నిర్ధారణ

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

పదేళ్లకోసారి చేపట్టే జన గణనకు మరో అడుగు పడింది. ఇప్పటికే వివిధ ప్రక్రియలు పూర్తికాగా.. లెక్కింపునకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణపై ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏప్రిల్‌ నుంచి జనాభా లెక్కింపు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు అవసరమైన రెవెన్యూ, సరిహద్దుల నిర్ధారణకు ఉమ్మడి జిల్లాల అధికారులు నడుం బిగించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికనే వివరాలు సేకరించేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. 2020లోనే జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం జన గణన చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో జనగణన చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత చోటుచేసుకున్న పరిపాలన, భౌగోళిక మార్పులను తేల్చి ఈ సారి లెక్కింపు చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త మండలాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త పంచాయతీలు, వార్డుల పునర్విభజన జరిగింది. ఈ అంశాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీల సరిహద్దులు నిర్ధారణ చేస్తూ అవి ఏయే మండలాల పరిధిలో ఉన్నాయో తెలిపే నివేదిక తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు అనుబంధ ఫాం-1, అర్బన్‌ ప్రాంతాలకు అనుబంధ ఫాం-2 వినియోగించనున్నారు. ఈ నెల 27 వరకు పటాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ గ్రామాన్ని, అర్బన్‌ ప్రాంతాల్లో పురపాలిక వార్డు యూనిట్‌గా తీసుకోనున్నారు. .

రెండు దశల్లో..

సరిహద్దులు ఇతర వివరాలను పరిశీలించాక గణాంక అధికారులు ప్రక్రియను చేపడతారు. రెండు దశల్లో చేయనున్నారు. మొదటి దశలో ఈబీ(ఎన్యూమరేషన్‌ బ్లాక్‌) పరిధిలో ఇల్లు లేదా నిర్మాణాల గణన జరుగుతుంది. రెండో దశలో ఆయా గృహాల్లో ఎంతమంది నివసిస్తున్నారో తెలిపే లెక్కింపు ఉంటుంది.

తొలిసారిగా ట్యాబ్‌ల ద్వారా..

తొలిసారిగా దేశవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పక్కాగా జనగణనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా ఐదు జిల్లాలో పూర్తి చేశారు. టాప్‌-వ్యూ-పర్సన్స్‌ ఐడెంటిఫికేషన్‌(టీవీపీఐ) పద్ధతి (మొబైల్‌ యాప్‌ అప్లికేషన్‌) ద్వారా జనగణన చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొబైల్‌ యాప్‌ను సెన్సెస్‌ యూనిక్‌ యూజర్‌ ఐడీని అనుసంధానం చేయడం ద్వారా గణన చేపడతారు.

సమగ్ర సమాచారం సేకరణ

ఉమ్మడి జిల్లాలో చిట్యాల, నకిరేకల్‌, చండూర్‌, హాలియా, నందికొండ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, చౌటుప్పల్‌, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్‌ కొత్త పురపాలికలుగా మారాయి. వీటిలో కొన్ని సమీప గ్రామాలు విలీనమయ్యాయి. జిల్లాల విభజనతో పంచాయతీలు, పురపాలికల సరిహద్దులు మారాయి. కొత్తగా ఏర్పడిన మండలాలు, వాటి పరిధిలో గ్రామాల వివరాలతో హద్దులు గుర్తించారు. నూతన పురపాలక చట్టం ఆమోదంతో పురపాలక సంఘాల్లో వార్డుల సరిహద్దులు మారాయి. ఉమ్మడి జిల్లాలో తండాలతో పాటు శివారు పల్లెలు కొత్త పంచాయతీలుగా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సమాచారంతో జనాభా గణనకు సిద్ధమవుతున్నారు.

శిక్షణకు ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపిక చేసిన ఆరుగురు అధికారుల (మాస్టర్‌ ట్రైనర్ల)కు వారం రోజుల పాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. క్షేత్రస్థాయిలో జనగణనలో పాల్గొనే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం కానున్నారో కొద్ది రోజుల్లోనే తేలనుంది. ప్రతి ఇంటి సమాచారం, సామాజిక వర్గాల వివరాలు, పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు 2021-జనగణనలో సేకరించాల్సి ఉంటుంది. 150 గృహాలను ఒక బ్లాక్‌గా విభజించి లెక్కింపు చేపట్టనున్నారు. .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని