logo

సాగర గర్భంలో అలివి వేట

నాగార్జునసాగర్‌ జలాశయంలో నిషేధిత అలివి వల మత్స్య సంపదను ధ్వంసం చేస్తోంది. మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న ఈ తరహా వేటను నిషేధించాలన్న అభ్యర్థనను పట్టించుకునే నాథుడేలేకపోవడంతో నష్టం కలుగుతోంది. తెలంగాణ

Published : 27 Jan 2022 03:50 IST

నీరుగారుతున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథక లక్ష్యం

- పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే

జలాశయంలో చేప పిల్లలు విడుదల చేస్తున్న మత్స్యశాఖ అధికారులు, స్థానికులు (దాచినచిత్రం).

నాగార్జునసాగర్‌ జలాశయంలో నిషేధిత అలివి వల మత్స్య సంపదను ధ్వంసం చేస్తోంది. మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న ఈ తరహా వేటను నిషేధించాలన్న అభ్యర్థనను పట్టించుకునే నాథుడేలేకపోవడంతో నష్టం కలుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల చేయూతకు రూ.కోట్లు వెచ్చించి సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద రాయితీ చేపపిల్లల విడుదల చేస్తున్నా.. ఆ లక్ష్యం కాస్త నీరుగారుతోంది.

చందంపేట మండలం పొగిళ్ల నుంచి ప్రారంభమయ్యే కృష్ణానదీ తీరప్రాంతం వందల కిలోమీటర్ల దూరం విస్తరించింది. తీరంలో ప్రధానమైన నాగార్జునసాగర్‌ ప్రధాన జలాశయం జిల్లాలో వందల గ్రామాల్లో వేల సంఖ్యలో మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే చేపలు నిత్యం కోల్‌కతా, కేరళ, అస్సాంలకు ఎగుమతవుతుంటాయి. జలాశయాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల్లో గంగపుత్రుల్లో అలజడి మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం అలివివల. కొన్ని జాతుల చేపలు సీజన్‌ ఆధారంగా దొరుకుతాయి. మరి కొన్ని ఏడాదంతా లభిస్తుంటాయి. కాలానికనుగుణంగా వలలు సిద్ధం చేసి చేసి ఉపయోగించడం మత్స్యకారులకు సంప్రదాయంగా వస్తోంది. వీరు జలాశయంలో చేపలవేటతో ఉపాధితో పాటు జీవరాసుల సంతతి పెరగడానికి ప్రాధాన్యం ఇస్తారు. వేటకు ఎంపిక చేసుకునే వలతో చేపల సంతానోత్పత్తికి చిన్నచిన్న చేపలకు ముప్పువాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలివివల అందుకు అనుగుణంగా లేకపోవడంతో ఈ వలను నిషేధిత జాబితాలో చేర్చారు. దీన్ని ఉపయోగించడం వల్ల ఎంతదూరమైతే విసురుతారో ఆ పరిధిలోని చేపపిల్లలు దగ్గర నుంచి ఇతర సముద్రజీవులు ఒకేసారి పెద్ద సంఖ్యలో చిక్కుకుపోతాయి. ఈ తరహా వలలు వినియోగిస్తున్న మత్స్యకారులు భవిష్యత్తు అవసరాలు తీర్చే సంపదను సైతం ఒడ్డుకు చేర్చడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిషేధిత ఈ వలలను పీఏపల్లి, చందంపేట, నేరెడుగొమ్ము, పెద్దవూర మండలాల్లో కొందరు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో వీటిని వినియోగించి మత్స్యసంపదను కొల్లగొడుతున్నారు సొమ్ముచేసుకుని సంప్రదాయ వల మత్స్యకారుల పొట్టగొడుతున్నారు.

వ్యక్తమవుతున్న ఆందోళన...
మత్స్యకారుల జీవనోపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మత్స్యశాఖ ఈ జలాశయంలో మత్స్యకారుల కోసం 53.59 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. ఈ పిల్లలు సైతం విడుదల చేసిన వారం రోజుల్లోనే అలివివలకు చిక్కి ఒడ్డున పడి మృతిచెందాయని భవిష్యత్తులో తామెలా జీవనోపాధి పొందాలని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలివి నియంత్రణకు పలుమార్లు ఫిర్యాదులు చేసి మత్స్యశాఖ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయంలో మత్స్యకారులకు అలివ వల నిషేధంపై గతంలో పలుమార్లు అవగాహన కల్పించామని, ఫిర్యాదు చేసే మత్స్యకారులు సహకరిస్తే అలివి వల వేట నిషేధ సంపూర్ణ అమలుకు చర్యలు తీసుకుంటామని డివిజనల్‌ మత్స్యశాఖాధికారి మారయ్య తెలిపారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
- గడిగ బాలయ్య, అజ్మాపురం మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు

నాగార్జునసాగర్‌ జలాశయంలో మత్స్యకారుల కోసం ఏటా లక్షల చేపపిల్లల సీడ్‌ పోసినా అలివి వల వేటను నియంత్రించకపోవడంతో ఫలితం ఉండడం లేదు. అధికారులు ఓ వైపు చేపపిల్లలు పోస్తుండగా మరోవైపు మత్స్యకారులు అలివితో వాటిని ఒడ్డుకు లాగేస్తుంటారు. కారణంగా సంప్రదాయ వలలు నమ్ముకున్న మాలాంటి వాళ్లకు జీవనోపాధి లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు స్పందించి అలివి వేటను నియంత్రించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని