logo

పట్టణ చూపు.. ప్రగతి వైపు

నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జూన్‌ 3 నుంచి 18 వరకు 15 రోజుల పాటు అన్ని పురపాలికల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు

Published : 25 May 2022 02:49 IST

జూన్‌ 3 నుంచి 18 వరకు నాలుగో విడత కార్యక్రమం

పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఇటీవల మిర్యాలగూడలో సమీక్ష చేస్తున్న

పురపాలిక సంచాలకుడు ఎన్‌.సత్యనారాయణ

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జూన్‌ 3 నుంచి 18 వరకు 15 రోజుల పాటు అన్ని పురపాలికల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ సంచాలకుడు డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. పురపాలిక అధికారులతో పాటుగా పాలకవర్గం ఛైర్మన్‌లు పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం తరువాత పురపాలక సంఘాల అధ్యక్షులు, అధికారులను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పర్యటనకు విడతల వారీగా పంపాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఐదు అంశాలపై పట్టణ ప్రగతి కార్యక్రమంలో దృష్టి సారించాలని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పురపాలికల అధికారులు పట్టణ ప్రగతికి ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేకించి గ్రీన్‌ బడ్జెట్‌ను పురపాలికల బడ్జెట్‌లకు అనుగుణంగా ఖర్చు చేసేందుకు కమిషనర్లు, పర్యావరణ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా పురపాలికలను పరిశీలించాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశంలో సూచించారు. నిధులు ఉండి వ్యయం చేయకపోతే చర్యలు తీసుకుంటారనే భయంతో అధికారులు ముమ్మరంగా పనులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


త్వరలో పనులు ప్రారంభం: రవీందర్‌సాగర్‌, కమిషనర్‌, మిర్యాలగూడ

నిబంధనల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి స్థలం కేటాయించగా.. అనుమతులు లభించాయి. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తాం.


వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌

పట్టణాల్లో ఒకే చోట కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు ఉండేలా సమీకృత మార్కెట్‌ల నిర్మాణాలు జరపాలని ఆదేశించారు. దీనికి అవసరమైన స్థలాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. స్థల కేటాయింపులో సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారంభిస్తారు.

హరితహారం

పురపాలికల్లో హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పురపాలికల బడ్జెట్‌లో పదిశాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించగా.. దీన్ని పూర్తిగా ఖర్చుచేయాలని ఆదేశించారు. పట్టణాల్లోని వార్డుల్లో సాధ్యమైనంత వరకు నర్సరీలు ఏర్పాటు చేస్తారు. బృహత్‌ పట్టణ ప్రకృతివనాల పెంపునకు అవసరమైన స్థలాలు గుర్తించి ముందస్తు సన్నాహాలు చేయాలని సూచించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో, వీధుల్లో అవసరమైన ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటించాలి.

వైకుంఠధామాల నిర్మాణం

పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణాలను ఆక్టోబర్‌ నాటికి పూర్తిచేయాలని సూచించారు. నిర్మాణాలు పూర్తయిన వాటిని జిల్లా అదనపు కలెక్టర్‌, ఇతర అధికారులు సౌకర్యాలను పరిశీలిస్తారు. మిషన్‌ భగీరథ నీరు వైకుంఠధామాలకు నిత్యం సరఫరా అయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సామూహిక మరుగుదొడ్లు

అన్ని పురపాలికల్లో సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత పట్టణాలుగా ప్రకటించే లక్ష్యంతో పనిచేయటంతో పాటు మరమ్మతులకు గురైన సామూహిక మరుగుదొడ్లను పనిచేసేలా చూస్తారు.

పరమపద వాహనాల ఏర్పాటు

పట్టణాల్లో చనిపోయిన వారి మృతదేహాల తరలింపునకు పురపాలిక సంఘం తరఫున పరమపద వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతనంగా అవసరమైన వాహనాలను కొనుగోలు చేసి పట్టణాల్లో ఎవరు మృతిచెందినా అంత్యక్రియలకు పంపాలని ఆదేశించారు. వాహనాల పర్యవేక్షణకు సిబ్బందిని నియమించాలి.

గ్రామీణ క్రీడా ప్రాంగణాలు

పట్టణంలోని ఆయా వార్డుల్లో చిన్నారులు ఆడుకునేందుకు ఆటస్థలాలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను ‘ఏ ప్లేస్‌ టు ప్లే’ పేరుతో శుభ్రం చేయించాలని ఆదేశించారు. వార్డు స్థాయి క్రీడా కమిటీలను ఏర్పాటు చేసి వారితో క్రీడల నిర్వహణ చేపట్టాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని