logo

కోళ్ల దాణా సంచుల్లో బీటీ విత్తనాలు

భారత్‌లో నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు దొడ్డిదారిన విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

Published : 02 Jun 2023 04:48 IST

2.2 టన్నుల విత్తనాలు, కారు స్వాధీనం: రాచకొండ సీపీ

ఈనాడు- హైదరాబాద్‌: భారత్‌లో నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు దొడ్డిదారిన విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు కోళ్ల దాణా మాటున ఈ విత్తనాలను చేరవేస్తున్న ముఠాలోని ఇద్దర్ని బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన 2.2 టన్నుల బీటీ-3 విత్తనాలు, ఒక కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు సూత్రధారి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ, ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌, ఏసీపీ వెంకన్న నాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌తో కలిసి రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ గురువారం ఎల్బీనగర్‌లో కేసు వివరాలు వెల్లడించారు.

సంపాదన కోసం అడ్డదారి..

ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంవాసి రావి ప్రసన్నకుమార్‌(42) 20 ఏళ్ల క్రితం యాదాద్రి- భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు వలస వచ్చారు. పదేళ్ల క్రితం నవత ఆగ్రో డివిజిన్‌ పేరుతో చౌటుప్పల్‌లోనే ఎరువులు, విత్తనాల దుకాణం ప్రారంభించాడు. ఏపీలోని పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన గడ్డం రవీంద్రబాబు(42) ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లా కుహి గ్రామానికి వలస వెళ్లాడు. నిషేధిత బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి.. విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చౌటుప్పల్‌లో ఎరువుల దుకాణం నిర్వహించే ప్రసన్నకుమార్‌తో పరిచయం ఏర్పడింది. రవీంద్రబాబు ద్వారా విత్తనాలు తెప్పించి.. ఇక్కడి స్థానిక రైతులకు విడిగా విక్రయించేవాడు.

పైన దాణా.. లోపల నకిలీ..

ఈ నకిలీ విత్తనాలకు ప్రధాన సూత్రధారి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు ఐదేళ్లుగా ఈ నకిలీ దందా నడిపిస్తున్నాడు. నరసింహులు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు అనుమానం రాకుండా విత్తనాలను ప్రీమియం చికెన్‌ ఫీడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో బస్తాల్లో నింపి ఐదు రాష్ట్రాలకు సరఫరా చేస్తాడు.

రెండు రాష్ట్రాల్లో పోలీసుల వేట..

నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ బృందం ముఠా కోసం వెతికినప్పుడు కేవలం 24 కిలోలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. చౌటుప్పల్‌కు 2200 కిలోల నకిలీ విత్తనాలు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రం ఓ గోదాములో తనిఖీలు చేశారు. తొలుత చికెన్‌ ఫీడ్‌ అని నిందితులు నమ్మించినా వ్యవసాయ శాఖ అధికారులతో పరిశీలన చేయించగా.. అవన్నీ బీటీ విత్తనాలని తేలింది. గడ్డం రవీంద్రబాబు, రావి ప్రసన్నకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు