logo

సాహితీ వారసుడు పురుషోత్తమాచార్యులు

హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులు జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు పొందారు.

Published : 26 Aug 2023 03:37 IST

జాతీయ అవార్డుకు ఎంపికైన పురుషోత్తమాచార్యులును సన్మానిస్తున్న కవులు, రచయితలు

హుజూర్‌నగర్‌ గ్రామీణం, నీలగిరి, న్యూస్‌టుడే: హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులు జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు పొందారు. సంగీత విద్వాంసుడు ముడుంబై వేంకట నర్సింహాచార్యులు, మంగతాయమ్మలకు ఏడుగురు సంతానం. వారి పెద్ద కుమారుడే పురుషోత్తమాచార్యులు. తాత, తండ్రిని చూస్తూ చిన్ననాడే సంగీతం, సాహిత్యంతో పాటు నటన, గానం, రచన అన్ని రంగాల్లో తనదైన ముద్రవేశారు. సాహిత్యంలో అనేక పరిశోధనలు చేసిన ఆయన సినీ సంగీతం, సాహిత్యంపైన మిసిమి అనే మాస పత్రికలో రాసిన కథనాలను పరిశీలించిన జాతీయ సినీ అవార్డు కమిటీ ఆయన్ను ఉత్తమ విమర్శకుడిగా ఎంపిక చేసింది. పురుషోత్తమాచార్యులు నల్గొండలోని గీతా విజ్ఞాన ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూ అక్కడే స్థిరపడ్డారు. సోదరి పద్మ, సోదరుడు దామోధరాచార్యులు కూడా సంగీత రంగంలోనే ఉన్నారు. తండ్రి సంగీత విద్వాంసుడు, కళాకారుడు కావడంతో ఈయన కూడా బాల నటుడిగా మన కర్తవ్యం, ద్రోహం, మేటి రైతు నాటికల్లో నటించారు.

ప్రయాణం ఇలా:

ఆకాశవాణిలో 1992లో లలిత సంగీత గానం చేశారు. శ్రీసుదర్శన ప్రభావం, హరిసంకీర్తనాచార్య లాంటి పద్యనాటకాలు రచించారు. 1979-85 వరకు శ్రీత్యాగరాజ ఉత్సవ సమితి కాద్యదర్శిగా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి అధ్యక్షుడిగా, ఘంటసాల కల్చరల్‌ అసోసియేషన్‌ ద్వారా 2 వేలకు పైగా సినీ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనాథబ్రహ్మ సంగీత కళాశాల ద్వారా 500 మందికి పైగా సంగీత విద్యను బోధించారు. 1985లో తపస్విని వీడియో చిత్రానికి సంగీత దర్శకుడిగా, 2000 సంవత్సరంలో అందరికీ విద్య ఆడియో సీడీ, 2006 నుంచి అన్నమయ్య పదశ్రుతి, అన్నమయ్య నృసింహ కీర్తనలు, అలంపురం జోగులాంబ కీర్తనలు, శ్రీనివాస చరితం లాంటి పలు సీడీలకు సంగీత దర్శకుడిగా ఉన్నారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నంది నాటకోత్సవ పోటీలకు, 1999లో అన్నమాచార్య భావనావాహిని హైదరాబాద్‌ వారు నిర్వహించిన నంది నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు. పురుషోత్తమాచార్యులు రచించిన సరాగాలు(పాటలు), విరిమువ్వలు(వచన కవితలు), పదో తరగతి తెలుగు పాఠ్యాంశ కథలు, మన ఘంటసాల సంగీత వైభవం లాంటివి 20 వరకు ముద్రణ అయ్యాయి. మచిలీపట్నంలో కళాపీఠం వారి ఘంటసాల కమెండేషన్‌ అవార్డు, హైదరాబాద్‌ శ్రీకళానిధి సంస్థ వారు ఉత్తమ సంగీత విద్వాన్‌ పురస్కారం, 2016లో తెలుగు విశ్వవిద్యాలయం వారు సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. శ్రీ చందాల కేశవదాసు సాహిత్యంపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌ పొందారు.

సాహిత్యాన్ని అందరికీ దగ్గర చేయడానికి కృషి: పురుషోత్తమాచార్యులు  

వారసత్వంగా అందుకున్న సాహిత్యం మర్చిపోకుండా అందరికీ దగ్గర చేయడానికి కృషి చేస్తున్నాను. సంప్రదాయ సంగీతం, సాహిత్యంపై రచనలతో పాటు అనేక పరిశోధనలు చేస్తూ వ్యాసాలు రాశాను. జాతీయ అవార్డుకు ఎంపికవడం సంతోషంగా ఉంది. నాకు విద్యనందించిన వారికి అవార్డును అంకితం ఇస్తున్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని