logo

నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు

ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు.

Published : 23 Apr 2024 02:37 IST

ఆదర్శనగర్‌లో ఇరుకుగా ఒక కాలనీ

ఆలేరు, న్యూస్‌టుడే: ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. కానీ గృహ నిర్మాణదారుల్లో అవగాహన లోపం, నిర్లక్ష్యం, పుర యంత్రాంగం మెతకవైఖరి వెరసి యజమానులు నిబంధనలు పాటించకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా పురపాలిక ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించక పోవడంతో వీధులు, కాలనీలు ఇరుకుగా మారుతున్నాయి.

నిబంధనలకు పాతర...

పురపాలికల నిబంధనల మేరకు ముప్పై అడుగుల వెడల్పు స్థలాన్ని దారికి వదిలి నిర్మాణాలు చేపట్టాలి. ఇంటి యజమాని దరఖాస్తు సమయంలో ఇంటి ప్లానులో 30 అడుగుల రహదారిని వదిలి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇందుకు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తున్నారు. కానీ చాలావరకు 18, 20 అడుగుల రహదారులే ఉండగా ఈమేరకే నిర్మాణాలు జరుగుతున్నాయి.

క్షేత్రస్థాయిలో ఇలా... .

ఆలేరు పురపాలికలో ఏటా వందకు పైగా నిర్మాణాలు జరుగున్నాయి. వీటిలో 2/3 వంతు మేర నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వం గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బృందం నూతన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి దారులు ఆక్రమించి, నిబంధనలు విస్మరించి నిర్మించిన కట్టడాలను గుర్తించి కూల్చివేయాల్సి ఉంది. కానీ ఇలాంటివి జరిగిన దాఖలాలు లేవు. రహదారి మధ్యలో నుంచి 15 అడుగుల దారి వదిలి చేపట్టాల్సిన నిర్మాణాల గురించి పుర అధికారులు, సిబ్బంది పట్టించుకుంటున్న దాఖలాలులేవు.  

సదుపాయాలకు అవరోధం..

సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించకుండా చేపడుతున్న నిర్మాణాలు, ఇళ్లముందు ర్యాంపులు, మొక్కల కోసం నిర్మించిన గద్దెల కారణంగా 18, 20 అడుగుల రహదారులు మరింత కుచించుకుపోతున్నాయి. కొన్ని వీధులు, కాలనీల్లో ఆటోలు, కార్లు ఎదురెదురుగా వెళ్లలేని విధంగా నిర్మాణాలు చేపట్టారు. శివారు కాలనీలు, పాత వీధుల్లో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంది. క్రాంతినగర్‌, మార్కెండేయ కాలనీ, సిల్క్‌నగర్‌, వడ్డెరబస్తీ, బీసీకాలనీ సంతోషినగర్‌, గణేష్‌నగర్‌, చింతలబస్తీ కాలనీల్లో సెట్‌బ్యాక్‌ లేని నిర్మాణాలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాల కారణంగా మురుగు కాలువలు, సీసీ రహదారులు, నల్లా పైపులైన్లు ఇతరత్రా అవసరాల కోసం తరచూ ఇబ్బందులు తప్పడం లేదు.


పరిశీలన చేస్తున్నాం:

కె.లక్ష్మీ, పుర కమిషనరు, ఆలేరు

అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్ల వివరాలను పుర సిబ్బంది గుర్తిస్తున్నారు. సెట్‌బ్యాక్‌ పాటించని విషయమై ఫిర్యాదులు అందితే వెంటనే చర్యలు చేపడతాం. దరఖాస్తు సమయంలో ఉన్న నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలి. లేదంటే కూల్చివేతలు, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని