logo

నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే!

జిల్లాలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

Updated : 17 Apr 2024 05:00 IST

దుత్తలూరులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

దుత్తలూరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌)ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను నియమించి వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్యాంకుల లావాదేవీలపై కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు. పార్టీలు, అభ్యర్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 ప్రచారాల్లో ఇవి తగవు.. మతపరమైన ప్రార్థనా మందిరాల్లో కులం, మతం, ప్రాంతం, వర్గ, జాతి బేధాలు తదితర సున్నితమైన అంశాలతో ప్రచారం చేయరాదు. ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగేలా ఊరేగింపుతో వెళ్లరాదు. అనుమతి ఉన్న వాహనాల్లో మాత్రమే ప్రచారాలు చేయాలి. ఇందులో ఐదుగురి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లో, మైదానాల్లో అనుమతి లేకుండా ప్రచారాలు చేయకూడదు. ప్రైవేటు స్థలాల్లో చేసేందుకు ఇంటి, స్థల యజమాని, ఎన్నికల అధికారి అనుమతులు తీసుకోవాలి. ప్రచారాల్లో మద్యం పంపిణీ పూర్తిగా నిషేధం. ప్రజల మధ్య శత్రుత్వం పెరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు.

అడ్డు చెప్పకూడదు

కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తుంటారు. వాహనాలు ఆపి పూర్తిగా పరిశీలిస్తారు. దీనికి అభ్యంతరం పెట్టే అధికారం ఎవరికీ లేదు. వాటిల్లో నిషేధిత వస్తువులు ఉంటే స్వాధీనం చేసుకుంటారు. పరిమితికి మించి లెక్కలు, ఆధారాలు చూపని నగదు, మద్యం ఉంటే వాహనంతో సహా సీజ్‌ చేస్తారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. ఇప్పటికే జిల్లాలో 18 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

చేయకూడనివి..

సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వినియోగించరాదు.  పోలింగు రోజు ఓటర్ల రవాణాకు ఎలాంటి వాహనాలు ఉపయోగించకూడదు. ఎన్నికల ఫలితాలపై సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు. పోలింగు కేంద్రాల్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఈవీఎంలు, ఇతర దస్త్రాలు తొలగించడం నేరం. రహస్య ఓటింగ్‌ పద్ధతికి, ఇతరుల సభలు, సమావేశాలకు భంగం కలిగించటం, ప్రదర్శనలతో ట్రాఫిక్‌ అంతరాయం కలిగించకూడదు. తప్పుడు ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌కు అనుమతి లేదు. తాత్కాలిక, శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టకూడదు. కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులను సమీక్షలు, సమావేశాలకు పిలవకూడదు.  పోలింగు 48 గంటల ముందు ప్రచారాలు పూర్తిగా ఆపేయాలి. నామినేషన్లు వేసేటప్పుడు మూడు వాహనాల్లో మాత్రమే రావాలి. ఐదుగురికి మాత్రమే ఈఆర్వో కార్యాలయంలోకి అనుమతి ఇస్తారు.

చేసుకోదగినవి...

న్యాయస్థానం ఆదేశాలు ఉన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. కరవు నివారణ పనులు చేపట్టవచ్చు. కరవు ప్రాంతాల్లో ఆహార సరఫరా చేయవచ్చు. ఎన్నికల సంఘం అనుమతితో మంచినీటి సరఫరా, ఖైదీల విడుదల, గిట్టుబాటు ధరల నిర్ణయం తీసుకోవచ్చు. అభ్యర్థి ప్రచారానికి టోపీలు, మాస్కులు వగైరా ఇవ్వొచ్చు. ప్రత్యర్థి పార్టీ విధి విధానాలను విమర్శించొచ్చు.  రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతితో ఊరేగింపులు, ర్యాలీలు చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు