logo

సైకో కిరాతకం

కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు సైకోగా మారి డంబెల్స్‌తో కొట్టి కడతేర్చాడు. అడ్డొచ్చిన సోదరి తలకూ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సుల్తాన్‌బజార్‌

Published : 25 Jan 2022 03:12 IST

అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు డంబెల్స్‌తో తల్లిపై దాడి

పాపమ్మ సుధీర్‌కుమార్‌

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు సైకోగా మారి డంబెల్స్‌తో కొట్టి కడతేర్చాడు. అడ్డొచ్చిన సోదరి తలకూ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సుల్తాన్‌బజార్‌ ఠాణా పరిధిలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కపల్లికి చెందిన కొండా రమేశ్‌, పాపమ్మ(45) దంపతులు. కొడుకు, కూతురు ఉన్నారు. బతుకుదెరువుకు కొన్నేళ్ల కిందటే నగరానికి వచ్చారు. అనారోగ్యంతో 8 ఏళ్ల క్రితం రమేశ్‌ మృతి చెందగా.. పాపమ్మ, కొడుకు సుధీర్‌కుమార్‌(24), కూతురు సుచిత్ర(25) రెండేళ్లుగా రాంకోఠిలో ఉంటున్నారు. డిగ్రీ చేసిన సుధీర్‌ కొన్నాళ్లు ప్రైవేట్‌ ఉద్యోగం చేశాడు. మానసికస్థితి సరిగ్గా లేక ఏడాదిగా ఇంటివద్దే ఉంటున్న కొడుకుకి తల్లి చికిత్స చేయిస్తున్నారు. రోజులాగే ఆదివారం రాత్రి ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు. సుధీర్‌ తెల్లవారుజాము 2 గంటలకు లేచి వ్యాయామం చేస్తుండగా తల్లి వారించింది. విచక్షణ కోల్పోయిన ఆయన చేతిలోని డంబెల్స్‌తో తల్లి తలపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సోదరిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని కారు అద్దం ధ్వంసం చేశాడు. సుచిత్ర కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడ్డ సుచిత్రను ఆసుపత్రికి.. పాపమ్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన, న్యాయమూర్తి (మెజిస్ట్రేట్‌) ఆదేశాల మేరకు సుధీర్‌కుమార్‌ను ఎర్రగడ్డమానసిక చికిత్సాలయానికి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి తెలిపారు. మంచిగా ఉండేవాడు: అందరితో మంచిగా ఉండేవాడని, మానసికస్థితి కోల్పోయాక ఇలా మారాడాని సోదరి, స్థానికులు పోలీసులకు చెప్పారు. మంచి సినిమాలు తీయాలని దర్శకులకు, బాగా నటించాలని నటులకు సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపేవాడని తెలిసినట్లు పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని