logo

అంతా అసంపూర్తే

ఆర్మూర్‌ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మంజూరైన రూ.2 కోట్ల మేర పనులు పూర్తిచేయడంతో సిద్ధులగుట్ట వైపు పనులు

Published : 25 Jan 2022 03:12 IST

సిద్ధులగుట్ట సమీపంలో అసంపూర్తిగా నిలిచిన డివైడర్‌ నిర్మాణం

న్యూస్‌టుడే, ఆర్మూర్‌ పట్టణం  : ఆర్మూర్‌ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మంజూరైన రూ.2 కోట్ల మేర పనులు పూర్తిచేయడంతో సిద్ధులగుట్ట వైపు పనులు నిలిచిపోయాయి. విలీన గ్రామాల్లో నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోవడం లేదు. 2018లో ప్రతిపాదించిన ఈ పనులు దశల వారీగా చేపడుతామని అప్పటి కౌన్సిల్‌ సభ్యులు, బల్దియాధికారులు పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు పూర్తి చేశారు. రెండో దశలో అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి పట్టణ శివారు వరకు చేపట్టాల్సి ఉంది. నిధులు ఉన్నంత వరకు చేపట్టి వదిలేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

విలీనాల్లో లేని వెలుగులు

పెర్కిట్‌ నుంచి మామిడిపల్లి బైపాస్‌ వరకు నిర్మిస్తామన్న డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు నిధుల కొరతతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ మధ్యలో మొక్కలు నాటేందుకు రూ.6 కోట్ల నిధులు అవసరమని బల్దియాధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, అవి విడుదల కాకపోవడంతో సమస్య ఏర్పడింది. విలీన గ్రామాల అభివృద్ధికి రావాల్సిన టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.20 కోట్లు వస్తే పనులు ప్రారంభించొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం: రఘు, ఏఈ, ఆర్మూర్‌ బల్దియా

విలీన గ్రామాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు కేటాయింపు, మంజూరు పూర్తయితే పనులు ప్రారంభించొచ్చు. ప్రతిపాదనలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

చీకట్లోనే ప్రయాణాలు

మామిడిపల్లి శివారులో ఇందిరమ్మ కాలనీ నుంచి పట్టణానికి వచ్చే దారి చీకటిగా ఉంటోంది. రాత్రివేళ ప్రయాణాలకు ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేసినా.. అవి అంతగా వెలుగునివ్వడం లేదు. డివైడర్‌ నిర్మాణం పూర్తి చేసి, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలి.

- బాలకృష్ణ, ఇందిరమ్మ కాలనీ, మామిడిపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని