logo

ముందు పని.. తరువాత టెండర్‌

ఎక్కడైనా రహదారి నిర్మాణం జరగాలంటే మొదట అంచనాలు రూపొందించాలి.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. తరువాత టెండర్‌ వేసి గుత్తేదారును ఎంపిక చేసి పనులు అప్పగించాలి. తదనంతరం ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతతో చేపట్టాలి

Published : 24 Jun 2022 06:25 IST

కామారెడ్డి పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ అధికారుల నిర్వాకం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులో నిర్మించిన రోడ్డు

ఎక్కడైనా రహదారి నిర్మాణం జరగాలంటే మొదట అంచనాలు రూపొందించాలి.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. తరువాత టెండర్‌ వేసి గుత్తేదారును ఎంపిక చేసి పనులు అప్పగించాలి. తదనంతరం ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతతో చేపట్టాలి. కామారెడ్డి జిల్లాలో మాత్రం ముందస్తు ఒప్పందాలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నారు. క్షేత్రస్థాయి ఇంజినీర్లు ఉన్నతాధికారుల కళ్లకు గంతలుకట్టి నిర్మాణం పూర్తి చేసిన రోడ్డుకు టెండర్‌ వేసి గుత్తేదారులను ఆహ్వానిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కిన పీఆర్‌(ఇంజినీరింగ్‌)శాఖ అధికారుల నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
* సమీకృత అధికారుల భవనం(కలెక్టరేట్‌) ప్రారంభోత్సవానికి ఏడాది కిందట ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పనులకు ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) నుంచి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ః పురపాలక సంఘం పరిధిలో ఆయా పనులకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అవసరమైన ఇంజినీరింగ్‌ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు నివేదించారు. ః దీంతో రూ.25 కోట్ల విలువైన పనుల పర్యవేక్షణ, అంచనాలు రూపొందించడం, టెండర్‌ పిలవడం వంటి వాటిని పీఆర్‌(ఇంజినీరింగ్‌) అధికారులకు అప్పగించారు. ః ఇదే అదనుగా గుత్తేదారులతో కుమ్మక్కయి టెండర్‌ లేకుండానే జిల్లాకేంద్రం శివారులో ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇద్దరు గుత్తేదారులతో బీటీ రోడ్డు వేశారు. ప్రస్తుతం వంతెనల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ః పనులు తుది దశకు చేరుతున్న సమయంలో నిర్మాణం పూర్తయిన రోడ్డు పనులు చేపట్టేందుకు పీఆర్‌ అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం గమనార్హం.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే..
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో మాత్రమే టెండర్‌కు ముందే రహదారుల నిర్మాణం చేపట్టవచ్చు. ముఖ్యమైన నాయకులు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి అధికారులు అత్యవసర పర్యటన సమయంలోనూ నిర్మించొచ్చు. ఇందులోనూ రూ.10 లక్షల- 20 లక్షల వ్యయంలోపు పనులు మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కిన ఇంజినీరింగ్‌ అధికారులు ఏకంగా రూ.2.48 కోట్ల రహదారి నిర్మాణాలు కానిచ్చేశారు. ఎందుకంత తొందరగా పూర్తి చేశారనే దానిపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రైవేటు సంస్థల వారికి లాభం చేకూర్చేందుకేనని సమాచారం.
నిర్మాణం జరిగినట్లు తెలియదు
క్షేత్రస్థాయి పీఆర్‌(ఇంజినీరింగ్‌) అధికారుల ప్రతిపాదనలతోనే టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చాం. పురపాలకశాఖ నుంచి పర్యవేక్షణ బాధ్యతలను మా శాఖకు బదలాయించారు. ఏఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులు ఆయా పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరిగినట్లు నాకు తెలియదు. మా శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చాం.

- ప్రభాకర్‌, ఎస్‌ఈ, పీఆర్‌, కామారెడ్డి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని