logo

అవినీతిపై పట్టింపేదీ?

పని పూర్తయిందనే ఆనందంతో కొందరు.. త్వరగా కావాలని మరికొందరు.. పక్కాగా కావాలనే ప్రణాళికతో ఇంకొందరు.. ఏదో రీతిలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది.

Published : 09 Dec 2022 05:09 IST

న్యూస్‌టుడే, భీమ్‌గల్‌

పని పూర్తయిందనే ఆనందంతో కొందరు.. త్వరగా కావాలని మరికొందరు.. పక్కాగా కావాలనే ప్రణాళికతో ఇంకొందరు.. ఏదో రీతిలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది. అన్ని శాఖల్లో ఇది వేళ్లూనుకుపోయింది. నిజాయతీగా విధులు నిర్వర్తించాల్సిన కొందరు నేతల అండదండలతో ప్రజలను జలగల్లా పీల్చుతున్నారు. కొన్నిశాఖల్లో లంచం అనేది సాధారణ అంశంగా మారిపోయింది. మరోవైపు అవినీతి నిరోధకశాఖ అధికారులు ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. అవినితీ నిరోధక వారోత్సవాల నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.. 

ఉమ్మడి జిల్లాలోని కొన్ని శాఖల్లో చేయి తడపనిదే పనులు కావడం లేదు. మరికొన్నింటిలో దళారుల అండతో అందినకాడికి దండుకుంటున్నారు. ఇలా కొందరు ఉద్యోగులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి తగ్గుతుందని అంతా భావించారు. కానీ, అక్రమార్కులు లంచం తీసుకోవడానికి కొత్త మార్గాలు వెతకడం, ప్రజలు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేయడం, అవినీతి నిరోధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడం ప్రధాన లోపంగా తెలుస్తోంది.

ఫిర్యాదులపై..

* క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి, పనుల్లో అవకతవకలపై ప్రజావేగులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూకబ్జాలు, సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్తున్నా ఉన్నతాధికారులు ఫిర్యాదుల పెట్టె తెరవడం లేదు.

* బాల్కొండ మండలం వేంపల్లికి చెందిన చిన్నయ్య.. లక్ష్మి డి3 కాలువ భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆధారాలతో ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. విలువైన సర్కారు భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన తిరుగుతున్నారు.

* భూ సమస్యలు, పంట కల్లాలు, పల్లెల్లో విద్యుత్తు నియంత్రికల మంజూరులో అవకతవకలపై ఫిర్యాదులు అందుతున్నా అధికారుల్లో చలనం ఉండటం లేదు. ఇలా ప్రజావేగుల ఫిర్యాదులపై పట్టింపు లేకపోవడంతో అవినీతి తారాస్థాయికి చేరుతోంది.

కనిపించని పర్యవేక్షణ

ఉమ్మడి జిల్లాలో తొమ్మిదేళ్లలో 59 కేసులు నమోదవగా 63 మంది అధికారులు పట్టుబడ్డారు. అవినీతి కేసుల్లో రెవెన్యూ, విద్యుత్తు, పోలీసు శాఖలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడాది రెవెన్యూ శాఖలో అధికారి, శిశు సంక్షేమశాఖలో ఓ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను విధుల్లో చేరే ముందు అంకితభావం, జవాబుదారీతనంతో పని చేస్తానని, సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం నడుచుకుంటానని ప్రమాణపత్రం ఇస్తారు. కొందరు సర్వీస్‌ నిబంధనలు పట్టించుకోకుండా అడ్డదారులు తొక్కుతున్నారు.


ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి
- అంకం నరేశ్‌, యూఎఫ్‌ఆర్‌టీఐ రాష్ట్ర కోకన్వీనర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో సకాలంలో పనులు కావాలంటే లంచం ఇవ్వడం కాకుండా ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు అలవర్చుకుంటే పనులు పారదర్శకంగా జరుగుతాయి. అధికారులతో పని చేయించుకోవడం ప్రజల హక్కు.. దాన్ని లంచంతో కాకుండా ప్రశ్నించి చేయించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని