logo

ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్‌ అలీ

మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని కీలక పదవి వరించింది. ఆయనను రాష్ట్రప్రభుత్వ సలహాదారు(బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ)గా నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 22 Jan 2024 05:49 IST

ఎట్టకేలకు దక్కిన కేబినెట్‌ హోదా
కామారెడ్డి కాంగ్రెస్‌లో జోష్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని కీలక పదవి వరించింది. ఆయనను రాష్ట్రప్రభుత్వ సలహాదారు(బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ)గా నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కామారెడ్డి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రెండేళ్ల నుంచి ఆయన తీవ్రంగా శ్రమించారు. రాజకీయ పరిణామాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓడిపోవడంతో కొంత ఢీలా పడ్డారు. కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఓడిపోవడంతో ఇక్కడి కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొంత నైరాశ్యం ఏర్పడింది. ఇలాంటి సమయంలో షబ్బీర్‌కు కెబినెట్‌ ర్యాంకు పదవి లభించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో తొలి నియామక పదవిని భర్తీ చేసినట్లయింది.

35 ఏళ్ల నుంచి కీలక నేతగా..

కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్‌ అలీ 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ నేతగా పనిచేసిన ఆయన 1987లో మాచారెడ్డి ఎంపీపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 1989లో కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో ఓటమి చెందారు. 2004లో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో విద్యుత్తుశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా శాసనమండలి ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఇప్పుడు కెబినెట్‌ ర్యాంకు పదవి వరించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన షబ్బీర్‌అలీకి ఒక దశలో మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అందరు భావించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనారిటీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఆయనకు దక్కలేదు. దీంతో నియమిత పదవి కట్టబెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని