logo

వెలుగుచూస్తున్న అక్రమాలు

Published : 17 Apr 2024 04:18 IST

 పై అంతస్తులు పెరిగినా పన్ను లేదు
బల్దియా సిబ్బంది సర్వేలో గుర్తింపు

కామారెడ్డి జిల్లాకేంద్రంలో భవన నిర్మాణ కొలతలు సరి చూస్తున్న సిబ్బంది

 ‘కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సిరిసిల్లరోడ్డులో ఓ భవన నిర్మాణాన్ని వాణిజ్య అవసరాలకు వాడుతున్నారు. దీనికి రూ.4 వేల పన్ను బిల్లు వస్తుంది. వాస్తవానికి ఈ నిర్మాణానికి రూ.10 వేల పన్ను రావాల్సి ఉంది.

‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవన సముదాయంవారు నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. ఏళ్ల నుంచి కొలతలను మార్చి పన్ను తక్కువ వచ్చేలా చేశారు. దీంతో పురపాలిక ఆదాయానికి గండి పడుతోంది.’

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

ఏళ్ల నుంచి ఇంటికి ఒకే రకమైన పన్ను చెల్లిస్తున్నారు. పురపాలక యంత్రాంగాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఇళ్లకు గృహ అవసర పన్ను విధిస్తున్నారు. ఇటీవల పురపాలక సిబ్బంది కొలతలు తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సమయంలో అనేక లోపాలు వెలుగుచూస్తున్నాయి.

భారీగా ఆదాయం కోల్పోతూ..

జిల్లాకేంద్రంలో పురపాలక పరిధిలో భారీగా ఆదాయం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇటీవల బడ్జెట్‌ సమావేశంలోనూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కొలతలు తీసి పన్నులు సవరించాలని అధికారులకు సూచించారు. దీంతో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన సిబ్బంది తప్పిదాలను గుర్తిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం బిల్‌కలెక్టర్లు తీసుకున్న కొలతలకు అదనంగా కొత్తవి తోడయ్యాయి. కింద ఒక అంతస్తు ఉండగా నూతనంగా నిర్మాణాలు చేపట్టారు. ఏళ్ల నుంచి మొత్తం నిర్మాణాలు పన్ను పరిధిలోకి రాక బల్దియా ఆదాయం కోల్పోతోంది.

తప్పిదాలను నమోదు చేస్తూ

జిల్లాకేంద్రంలో వార్డుల్లో సిబ్బంది ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. ఇప్పటికే బల్దియాకు రూ.6.80 కోట్ల ఆదాయం ఆస్తి పన్నుల రూపేణా సమకూరుతోంది. 49 వార్డుల్లో 22,135 నిర్మాణాలు ఉన్నాయి. అందులో నివాస, నివాసేతర, వాణిజ్య గృహాలు పన్ను పరిధిలో ఉన్నాయి. అనేక నిర్మాణాలు వాణిజ్య అవసరాలకు వాడుతున్నా గృహ కేటగిరీ కింద ఉండి పన్ను తక్కువగా వస్తోంది. దీంతో పురపాలికకు నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పన్నుల సవరణ చేపట్టేందుకు సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తున్నారు. రూ.12 కోట్ల మేర ఆస్తి పన్నులు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు.

గడువు పొడిగించేనా..?

కామారెడ్డిలో వార్డుకు 50 గృహాల చొప్పున సిబ్బంది కొలతలు తీయాలని పురపాలక అధికారులు బిల్‌కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. అసలే వేసవి కాలం. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో మే నెలాఖరు వరకు వెసులుబాటు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు ముందస్తు పన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీని రాబట్టాలి. ఆ తర్వాత ఏయే నిర్మాణం ఏ విధంగా ఉందో భువన్‌ సర్వే ద్వారా సరిచూడాలి. ఆ తర్వాత ప్రక్రియ చేపడితే సత్ఫలితాలను ఆశించే వీలుంది. ఈ విషయమై న్యూస్‌టుడే కమిషనర్‌ సుజాతను వివరణ కోరగా కొలతలు తీయడానికి వచ్చేవారికి ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తప్పిదాలను రికార్డుల్లో నమోదు చేస్తున్నామన్నారు. కొలతలను ఆన్‌లైన్‌ చేస్తామన్నారు. బల్దియా ఆదాయ రాబడికి తోడ్పాటు అందించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని