logo

ఆరు నెలల కిందట వివాహం.. గాలిపటం దారమే మృత్యుపాశం

కొత్త సంవత్సరానికి నాలుగు రోజులే ఉంది. ఆరు నెలల కిందటే పెళ్లయిన ఆ యువకుడు భార్యను తీసుకొని వివిధ రకాల కొనుగోళ్ల కోసం కటక్‌ బయలుదేరాడు. గాలిపటానికి కట్టిన దారం ఆయన పాలిట మృత్యుపాశమైంది. గొంతు తెగిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఎన్నో ఆశలతో

Updated : 28 Dec 2021 09:27 IST


జయంత్‌ దంపతులు (పాతచిత్రం)

కటక్, న్యూస్‌టుడే: కొత్త సంవత్సరానికి నాలుగు రోజులే ఉంది. ఆరు నెలల కిందటే పెళ్లయిన ఆ యువకుడు భార్యను తీసుకొని వివిధ రకాల కొనుగోళ్ల కోసం కటక్‌ బయలుదేరగా గాలిపటానికి కట్టిన దారం ఆయన పాలిట మృత్యుపాశమైంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. బయర్‌పూర్‌ గ్రామానికి చెందిన జయంత్‌ సామల్‌ (24) తన భార్యను తీసుకొని ఆదివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై కటక్‌ బయలుదేరాడు. వాహనంపై వెళుతుండగా జగత్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిరాబజార్‌ వద్ద ఆయన గొంతుకు గాలిపటానికి కట్టిన దారం తగిలింది. దీంతో గొంతు తెగిపోవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఆయన జీవిత భాగస్వామి గుండెలవిసేలా రోదిస్తోంది. ఘటనపై ఆయన కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాలి పటాలు ఎగరేసేందుకు వినియోగించే కోల్‌కతా దారాల విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ వ్యాపారులు వాటిని విక్రయించడంతో దానిని కట్టి గాలిపటం ఎగురేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దారాలు తెగిపోకుండా ఉండడానికి వివిధ రకాల పూతలు వేస్తారు. దీంతో ఇవి గట్టిగా, వాడిగా ఉంటాయి.

పూరీలో మరో ఘటన

కటక్, న్యూస్‌టుడే: కటక్‌లో జరిగిన ఘటనే సోమవారం పూరీలో జరిగింది. బొడొదండోలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భంజ్‌విహార్‌ పాత్ర అనే వ్యక్తి కంఠానికి గాలి పటం దారం తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను సమీపంలోని ఆరోగ్యకేంద్రానికి తరలించారు. కటక్‌లో జరిగిన ఘటనపై డీసీపీ ప్రతీక్‌ సింగ్‌ మాట్లాడుతూ జగత్పూర్‌ ప్రాంతంలో గాలిపటం దారం ప్రమాదంపై దర్యాప్తు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని