logo

తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు

మల్కాన్‌గిరి సమితి ఎమ్‌.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి

Published : 29 Mar 2024 07:30 IST

చికిత్స పొందుతున్న సుకాంత్‌
మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి సమితి ఎమ్‌.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సదర్‌ గ్రామానికి చెందిన సుకాంత్‌ మండల్‌ బుధవారం ఇంటి ఎదుట నిలబడి ఉన్న సమయంలో తోడేలు వచ్చి అతనిపై దాడి చేసింది. అతని కేకలు విని భార్య స్థానికులను పిలవగా వారు వచ్చి తోడేలును హతమార్చారు. ఈ క్రమంలో గ్రామస్థుడు ఉత్పల్‌ సర్కార్‌, సుకాంత్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పండ్రిపణి ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం మల్కాన్‌గిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవీ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


భర్త చేతిలో భార్య హతం

 నవరంగపూర్‌, న్యూస్‌టుడే: ఓ వివాహితుడు భార్యకు ఉరేసి హత్య చేసిన ఘటన నవరంగపూర్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది. జొరిగావ్‌ ఠాణాధికారి తపన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం సదరు సమితి గురుసింగ్‌ పంచాయతీ కుసుమి గ్రామానికి చెందిన దశము హరిజన్‌తో మహండి గ్రామానికి చెందిన రాద్మకు వివాహం జరిగింది. ఈ నెల 9వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన దశము భార్యను కొట్టాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు ధన్‌సింగ్‌ సోదరిని చికిత్స అనంతరం తన ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం దశమ అత్తవారింటికి వచ్చి మళ్లీ గొడవ చేయనని, భార్యను బాగా చూసుకుంటానని చెప్పడంతో రాద్మను పంపేందుకు అంగీకరించారు. రెండు రోజలు ఇక్కడే ఉండాలని ధన్‌సింగ్‌ చెప్పాడు. అక్కడే ఉన్న దశము గురువారం తెల్లవారు జామున రాద్మ మెడలో తాడు బిగించి ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. రాద్మ తల్లి బుదంతి చూసి అడ్డుకోగా, ఆమెను పక్కకు నెట్టి నిందితుడు పరారయ్యాడు. రాద్మను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శవపరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా జయపురం సమితి జయనగర్‌- బొయిపరిగూడ జాతీయ రహదారి-26, బాలియా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఐఐసీ ఈశ్వర్‌ తాండి తెలిపిన వివరాల ప్రకారం.. బొరిపరిగూడ సమితి అంబాభట్టా గ్రామానికి చెందిన అనంత్‌ కుర్లియా (28), అతని భార్య తులసి, సోదరుడు ఉద్ధవ్‌ గురువారం ఉదయం జయపురం సమితి గొడపొదరలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, కుంద్ర సమితి పండకిమారికి చెందిన ప్రశాంత్‌నాగ్‌ జయపురం నుంచి బొయిపరిగూడకు ద్విచక్ర వాహనంపై వెళ్తు బాలియా ప్రాంతంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అనుత్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. శవపరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రశాంత్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్‌ ఆసుపత్రికి తరలించారు. 


దాడి కేసులో ఇద్దరి అరెస్టు

జయపురం, న్యూస్‌టుడే: డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసి ఓ వ్యక్తిపై దాడిచేసిన కేసులో జయపురం టౌన్‌ పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేశారు. ఐఐసీ ఈశ్వర్‌ తాండి తెలిపిన వివరాల ప్రకారం.. జయనగర్‌ ప్రాంతంలో జరుగుతున్న నీలకంఠ సాగరం పునరుద్ధరణ పనుల వద్దకు ఒడియా మేద్రిసాహి ప్రాంతానికి చెందిన హరినాగ్‌(27), గోపబంధునగర్‌కు చెందిన స్వాధీన్‌ పాణిగ్రహి(25) ఈ నెల 26వ తేదీన వచ్చారు. గుత్తేదారు సలహాదారుడు అయిన గుప్తేష్‌రథ్‌తో మాట్లాడుతూ పనులు జరిగేంతవరకు తమకు ప్రతి నెల రూ. 8 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు అంగీకరించని గుప్తేష్‌పై నిందితులతోపాటు వారి స్నేహితులు దాడి చేశారు. గుప్తేష్‌ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. బెయిల్‌ మంజూరు కాకపోవడంతో జైలుకు తరలించారు. వారి నుంచి రెండు చరవాణులు, సుత్తి, కత్తి స్వాధీనం చేసుకున్నారు. 


ద్విచక్ర వాహనానికి నిప్పు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని మూడో వార్డు నోడియాతుట్ట సాహిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు ఓ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టిన ఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే రాజేంద్ర పొడిహరి ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. రాజేంద్ర ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐఐసీ ప్రశాంత్‌ భూపతి తెలిపారు.


జంతికల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌ నవీన్‌ నివాస్‌ చేరువలోని పలాసపల్లి వద్ద గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఒక జంతికల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలు నియంత్రణలోకి తెచ్చారు. ప్రాణనష్టం లేకపోయినా రూ.లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. మరుగుతున్న నూనె కడాయి పేలిపోవడంతో మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారి ఎస్‌.కె.దాస్‌ విలేకరులకు చెప్పారు.


గర్భం తొలగించే యత్నంలో బాలిక మృతి

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి జిల్లాలో ఓ బాలిక గర్భాన్ని తొలగించే సమయంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మల్కాన్‌గిరి జిల్లాలోని ఓ బాలిక పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో ఆమె తల్లి గర్భాన్ని తొలగించేందుకు ఆశా కార్మికురాలిని ఆశ్రయించింది. ఆమె అందుకు రూ.5వేలు నగదు తీసుకుని ఔషధం ఇచ్చింది. అనంతరం బాలిక అనారోగ్యానికి గురై, కొద్ది సేపటికే మృతిచెందింది. ఆశా కార్మికురాలు ఇచ్చిన ఔషధం వల్లే బాలిక మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని