logo

Vizianagaram: విధులకు సెలవు పెట్టి.. ఇళ్లపై కన్నేసి.. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దొంగతనాలు

అతడో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌.. విధులు సక్రమంగా నిర్వర్తించి.. దేశానికి సేవ చేయాల్సిన వ్యక్తి.. కానీ అడ్డదారులు తొక్కాడు.. అక్రమంగా డబ్బులు సంపాదించాలని కొలువునొదిలి ఇళ్లకు కన్నాలేయడం మొదలు పెట్టాడు.

Updated : 22 Aug 2023 08:47 IST

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఆర్‌.గోవిందరావు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: అతడో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌.. విధులు సక్రమంగా నిర్వర్తించి.. దేశానికి సేవ చేయాల్సిన వ్యక్తి.. కానీ అడ్డదారులు తొక్కాడు.. అక్రమంగా డబ్బులు సంపాదించాలని కొలువునొదిలి ఇళ్లకు కన్నాలేయడం మొదలు పెట్టాడు. ఏకంగా 12 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. పెద్దఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొట్టేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ కేసు వివరాలను డీఎస్పీ గోవిందరావు సోమవారం విలేకరులకు వెళ్లడించారు.

నగరానికి చెందిన కె.శ్రీనివాసరావు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. సెలవుపై గతేడాది ఆగస్టులో వచ్చేశాడు. ఉడాకాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఈక్రమంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. రూ.లక్షల్లో అప్పులపాలయ్యాడు. దీంతో ఉద్యోగానికి వెళ్లలేదు. అప్పులు తీర్చేందుకు దొంగగా మారాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గ సామగ్రి కొన్నాడు. తాళాలు వేసి ఉన్న గృహాలే లక్ష్యంగా.. పగటి వేళ రెక్కీ నిర్వహించేవాడు. రాత్రి 9 గంటల సమయంలో బయలుదేరి.. 12 గంటలయ్యే సరికి దోచేసేవాడు. ఇప్పటి వరకు 12 చోట్ల నేరాలకు పాల్పడ్డాడు. ఉడాకాలనీ ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3, అలకానంద కాలనీ, రింగురోడ్డు, బాబామెట్ట తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి అపహరించాడు.

ఇలా దొరికేశాడు..: వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈనెల 14న ఉడాకాలనీ సమీపంలోని ఆర్టీసీ కాలనీలో బి.శ్యామ్‌కుమార్‌ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం శాలిపేట వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, శ్రీనివాసరావు ఓ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పట్టుకుని తనిఖీ చేయగా.. అందులో కొన్ని తాళాలు, స్క్రూడ్రైవర్‌ తదితర పరికరాలున్నాయి. వాటిపై ఆరా తీయగా.. నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారం, ఆరు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన ఒకటో పట్టణ సీఐ బి.వెంకటరావు, ఎస్సై వి.అశోక్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాస్‌, బి.శివ, బి.శంకరరావు, ఎన్‌.గౌరీశంకర్‌ను ఆయన అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని