logo

ఇదేం బాదుడు

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్‌వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది.

Updated : 29 Mar 2024 06:11 IST

మూలధన విలువ ఆధారిత విధానంలో ఆస్తి పన్ను వసూలు
ఏటా 15 శాతం పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం
(న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, పాలకొండ)

విజయనగరం నగరపాలక సంస్థలో గృహాలు

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్‌వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. తర్వాత మూలధన విలువ ఆధారిత పన్ను మదింపు విధానం అమల్లోకి వచ్చిన తొలి ఏడాది 2021-22లో రూ.4360కి పెరిగింది. 2022-23లో రూ.5014, 2023-24లో రూ.5766 అయింది. ఏటా 15 శాతం చొప్పున సాట్యురేషన్‌ కాలం పూర్తయిన వరకు పెంచుతారు.


నగరంలోని ఉల్లివీధిలో 1301 చ.అ. ఓ వాణిజ్య భవనం (జీ+2) ఏఆర్‌వీ విధానంలో 2020-21లో ఏడాదికి రూ.1,19,000 ఆస్తిపన్ను చెల్లించేవారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక 2021-22లో రూ.1,30,784కు   పెరిగింది. 2022-23లో రూ.1,33,400, 2023-24లో రూ.1,36,068 చెల్లించాల్సి వచ్చింది. సదరు భవనం సాట్యురేషన్‌ కాలం మొదటి ఏడాదిలోనే దాటడంతో ఏటా రెండు శాతం పన్ను పెంచుతున్నారు.


విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో కొత్త ఆస్తిపన్ను మదింపు విధానం వల్ల ఏటా ప్రజలపై పన్ను బాదుడు పడుతోంది. రిజిస్ట్రేషన్‌ శాఖ ఆస్తుల మార్కెట్‌ విలువ పెంచిన ప్రతిసారి మోపుతారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో అద్దె ఆధారిత ఆస్తిపన్నుల విధింపు విధానం అమలులో ఉండేది. ఆ మేరకు ప్రభుత్వం రెండు, మూడు, అయిదేళ్లకు ఒకసారి పన్ను పెంచేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నుల విధింపు విధానం 2021-22 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆస్తికి మార్కెట్‌ విలువను ప్రభుత్వం ఎప్పుడు పెంచితే అప్పుడు పన్నులు పెంచేలా నిర్ణయించింది. భవనం నిర్మించి పదేళ్లు పూర్తయితే 11వ ఏట నుంచి ఒక్కో శాతం చొప్పున తరుగుదల తీసి పన్ను విధిస్తారు. ఇందులో భాగంగా ఏటా మార్చిలో సవరిస్తారు.

ఈ మేరకు ఆమోదం

నూతన విధానం ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఇంటి పన్ను పెంపుదలకు ప్రభుత్వం అప్పట్లో అన్ని పురపాలికల్లో అనుమతి ఇచ్చింది. విజయనగరం నగరపాలక సంస్థలో నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.3 శాతం మించకుండా కౌన్సిల్‌ ఆమోదం తీసుకున్నారు. దీని ప్రకారం పన్ను విధిస్తున్నారు. ఇది ఆయా పురపాలికలు, నగర పంచాయతీల పాలకవర్గాల తీర్మానం మేరకు వసూలు చేస్తారు. ప్రస్తుతం మళ్లీ పన్ను పరిధిలోకి రానివి గుర్తించి వార్డు సచివాలయాల వారీగా ఆన్‌లైన్‌ ప్రక్రియ చేస్తున్నారు. కమిషనరు లాగిన్‌లోని డ్యాష్‌బోర్డులో అన్ని రకాల అసెస్‌మెంట్ల వివరాలు పొందుపర్చినట్లు అధికారులు చెబుతున్నారు.


పెరుగుదల ఉంటుంది
- జి.నాగరాజు, ఆర్డీ, విశాఖ రీజియన్‌

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మూలధన విలువ ఆధారిత పన్ను విధింపు 2021-22 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు వసూలు చేస్తున్నాం. పాత పన్ను మూలధన విలువతో సమానం అయ్యే వరకు ఏటా 15 శాతం చొప్పున పెంచుతున్నాం. ఆ తర్వాత నుంచి రెండు శాతం విధిస్తాం. పుర సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల వసూలుకు ఆటంకం కలుగుతోంది. వడ్డీమాఫీని ప్రజలు వినియోగించుకుని పన్నుల చెల్లింపునకు ముందుకు రావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని