logo

నోటికాడ కూడూ లాగేశారు!!

నోటి కాడ కూడునూ లాగేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కనీసం రేషన్‌ బియ్యాన్ని కూడా ఇవ్వడం లేదు. కొన్ని  నెలలుగా రూపాయికే అందించాల్సిన సరకును ఆపేసింది

Updated : 17 Apr 2024 06:03 IST

రూపాయి బియ్యం ఇవ్వని జగన్‌
16 నెలలుగా సరఫరా నిలిపివేత
కేంద్రమిచ్చే సరకు తనదిగా ప్రచారం

 

నోటి కాడ కూడునూ లాగేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కనీసం రేషన్‌ బియ్యాన్ని కూడా ఇవ్వడం లేదు. కొన్ని  నెలలుగా రూపాయికే అందించాల్సిన సరకును ఆపేసింది. కేంద్రం ఇస్తున్న దానినే తనదిగా ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపేస్తోంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌

రేషన్‌ బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేయాలి. గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద కేంద్రం కరోనా విపత్తు కాలం నుంచి బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కుటుంబంలో ఒకరికి అయిదు కిలోల చొప్పున 2020 ఏప్రిల్‌ నుంచి ఇస్తోంది. 2023 డిసెంబరు వరకే ఈ ప్రక్రియ ఉంటుందని తొలుత ప్రకటించినా, గతేడాది మళ్లీ పెంచారు. మరో ఏడాది ఇస్తామని చెప్పారు. తాజాగా ఈ పథకాన్ని ఇంకో అయిదేళ్లు కొనసాగిస్తామని ప్రధానమంత్రి మోదీ ఇటీవల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రకటించారు.

 రాష్ట్రం చేస్తున్నదేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబ సభ్యుడికీ నెలకు అయిదు కిలోల చొప్పున ఇవ్వాలి. అయితే పదహారు నెలలుగా పంపిణీ నిలిపేసింది. 2023 జనవరి నుంచి అందించడం లేదు. కేంద్రం ఇస్తున్న సరకునే తాను ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటోంది. ఫలితంగా పేదలపై భారం పడుతోంది. ఒక కుటుంబం నెలకు రూ.600 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఎండీయూ వాహనాలపై మాత్రం ముఖ్యమంత్రి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. అయినా ప్రభుత్వం తీరు మారలేదు.

రెండు వేలిముద్రలు..

రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోవడంతో భాజపా నాయకులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సంబంధిత శాఖాధికారులు రెండు వేలిముద్రల ప్రక్రియను అమలు చేస్తున్నారు. గతంలో ఒక వేలిముద్ర వేస్తే సరకులు అందించేవారు. కొన్ని నెలలుగా ఒకటి కేంద్రానికి సంబంధించి, మరొకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సరకుల కోసం వేయాల్సి వస్తోంది.

ఇచ్చేది 53,108 కార్డులకే..

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 8,62,939 మంది కార్దుదారులు ఉన్నారు. ఇందులో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ(జాతీయ ఆహార భద్రత చట్టం) పరిధిలో ఉన్నవారికి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద కేంద్రం అయిదు కిలోల చొప్పున ఇస్తోంది. రెండు జిల్లాల్లో వీరు 8,09,831 మంది ఉన్నారు. వీరికి కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యానికి అదనంగా రూపాయికి కిలో చొప్పున రాష్ట్రం ఇవ్వాలి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో వారూ దీనికి అర్హులే. ఇటువంటి వారు ఉమ్మడి జిల్లాలో 53,108 మంది ఉన్నారు. వీరికి మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకొంటోంది. సాధారణంగా నెలకు 14,374.93 మెట్రిక్‌ టన్నులు అవసరం. ఈ లెక్కన 16 నెలలకు 2.29 లక్షల మెట్రిక్‌ టన్నులను జగన్‌ ప్రభుత్వం ఆదా చేసుకుంది.

ఏడాదికి రూ.7,200 భారం

కేంద్రం ఇస్తున్న బియ్యానికి అదనంగా రాష్ట్రం కూడా ఇస్తే కుటుంబంలో ఒక్కొక్కొరికీ పది కిలోలు అందేవి. దీంతో నెలకు సరిపడేవి. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో పేదలు, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.30 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. నలుగురు సభ్యులున్న కుటుంబంపై నెలకు రూ.600 వరకు భారం పడుతోంది. ఏడాదికి రూ.7,200 అదనంగా చెల్లించాలి. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్తు ఛార్జీల మోత, పన్నుల బాదుడుతో మరింత ఆర్థిక భారం మోయాల్సి వస్తోంది.

ప్రభుత్వ కోటా ఇవ్వాలి..

నేను, నా భర్త ఉంటున్నాం. మాకు వచ్చేవి 10 కిలోల బియ్యం మాత్రమే. వీటితో 30 రోజులు ఎలా బతుకుతాం. దీంతో ప్రతినెలా అదనంగా బయట కొంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తే ఇబ్బంది ఉండదు. మాలాంటి పేదలకు మేలు జరుగుతుంది. - ఎం.వరలక్ష్మి, పైలపేట, చీపురుపల్లి మండలం

సరిపోవడం లేదు..

మా ఇంట్లో ముగ్గురు ఉంటున్నాం. రేషన్‌ బియ్యం నెలకు 15 కిలోలు ఇస్తున్నారు. అవి చాలక బయట అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఒక్కొక్కరికీ నెలకు 10 కిలోలు ఇస్తే ఆ పరిస్థితి ఉండేది కాదు. మాకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పేవి. - ఎం.దుర్గారావు, మీసాలపేట, గుర్ల మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని