logo

మావయ్య పాలనలో బక్కచిక్కిన బాల్యం

ఈ బాలుడి పేరు ముఖేష్‌. కురుపాం మండలం బల్లుకోట గ్రామం. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలోని పౌష్టికాహార పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. పది నెలల వయసుకు 8 కిలోల బరువుండాలి.

Published : 17 Apr 2024 04:55 IST

ఈ బాలుడి పేరు ముఖేష్‌. కురుపాం మండలం బల్లుకోట గ్రామం. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలోని పౌష్టికాహార పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. పది నెలల వయసుకు 8 కిలోల బరువుండాలి. ప్రస్తుతం ఆరు కిలోలు మాత్రమే ఉన్నాః పౌష్టికాహార లోపంతో మన్యం చిన్నారుల ఘోష ః కనీస బరువు, ఎత్తు లేక ఆసుపత్రుల్లో చేరికడు. 70 సెంటీమీటర్ల పొడుగుకు 68 సె.మీ ఉన్నాడు. 14 రోజుల పాటు చికిత్స, పౌష్టికాహారం అందించి బరువు పెరిగాక డిశ్ఛార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.


కొమరాడ మండలం సీసాడవలసకు చెందిన ఈ పాప పేరు బి.దివ్య. రెండేళ్ల వయసులో రక్తంలో హెచ్‌బీ 7 గ్రాములు మాత్రమే ఉంది. ప్రస్తుత బరువు ఏడు కిలోలు. ఈ వయసుకి 10 కిలోలు ఉండాలి. ఎత్తు కూడా తక్కువగా ఉండటంతో పునరావాస కేంద్రంలో చేర్పించారు.

 - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, సీతంపేట

 ‘మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను’ అని చెప్పే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారి కష్టాలను మాత్రం వినడం లేదు. వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రతి తల్లికీ, బిడ్డకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని చెబుతున్నా.. అవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం బాల్యం బలహీనమవుతోంది. పోషకాహారం అందకపోవడం, రక్తహీనత, వైద్యారోగ్య సిబ్బంది పర్యవేక్షణ కరవవడం తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. వయసు, ఎత్తుకు తగ్గ బరువు, పెరుగుదల లేక చిన్నారులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని రెండు పౌష్టికాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు కావడం, అందులో నిత్యం చిన్నారులు కనిపిస్తుండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

ఆందోళనలో వైద్యులు

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ప్రాంతీయ, మూడు సీహెచ్‌సీలు, అయిదు పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. చిన్నా, పెద్ద కలిపి 60కి పైగా ప్రైవేటు వైద్యాలయాలు నడుస్తున్నాయి. వీటిలో ఏటా 14 వేలకు మించి ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా మంది పిల్లలు రెండు కిలోల కంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. అలాగే అయిదేళ్లలోపు వారిలో వందల సంఖ్యలోనే వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని వారు ఉంటున్నారు. రోజురోజుకీ ఈ పరిస్థితి పెరుగుతుండటంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. పౌష్టికాహార లోపమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.

అవగాహన లోపం..

తమ పిల్లల ఎదుగుదలకు ఏ రకమైన ఆహారం అవసరమనే దానిపై చాలామంది తల్లిదండ్రులకు అవగాహన కొరవడుతోంది. ఈక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రచార కార్యక్రమాలు మరింతగా క్షేత్రస్థాయికి చేరాల్సిన అవసరం ఉందని పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు బరువు లేకపోవడం, ఎత్తు పెరగడాన్ని గుర్తించడం లేదని, దీంతో చాలామంది ఇళ్ల వద్దే ఉండిపోతుండడంతో సమస్య తీవ్రమవుతోందని వెల్లడించారు. సాధారణంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సకాలంలో గుర్తించగలగాలి. ఈమేరకు అక్కడే వారికి పూర్తిస్థాయిలో ఆహారం అందించాలి. కానీ ఆ ప్రక్రియ జరగడం లేదు. పిల్లలు పుట్టకముందే గర్భిణులకు సేవలు మెరుగవ్వాలి. ఈ ఏడాదిలో జిల్లాలో 14,175 ప్రసవాలు జరగ్గా.. అందులో 326 మంది పిల్లలు తక్కువ బరువుతో జన్మించారు. వారు కోలుకోవడం కష్టమవుతోంది.

గిరిజన ప్రాంతాల్లోనే..

పిల్లల్లో పౌష్టికాహార లోపం, బరువు తక్కువ వంటి సమస్యలు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. ఏడాదికి సుమారు 300 మంది వరకు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఇందులో 90శాతానికి పైౖగా గిరిజనులే.

పునరావాస కేంద్రాలకు తాకిడి..

పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి, సీతంపేట ప్రాంతీయాసుపత్రుల్లో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద పౌష్టికాహార పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయి. పట్టణంలోని కేంద్రంలో ఏటా 300 మందికి పైగా చేరుతున్నారు. వీరిలో ఎక్కువగా గిరిజనుల పిల్లలే ఉంటున్నారు. 90 శాతం వారే కనిపిస్తున్నారు. భామిని, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన వారు ఉంటున్నారు. చేరుతున్న వారికి 14 రోజుల పాటు చికిత్స అందిస్తున్నామని, ఈ క్రమంలో సరైన ఆహారం ఇస్తున్నట్లు పార్వతీపురంలోని ఎస్‌ఎన్‌సీయూ వైద్యాధికారి దిలీప్‌ తెలిపారు.


ప్రత్యేక పర్యవేక్షణ

గర్భిణుల్లో పౌష్టికాహార సమస్య ఉంటే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అందులో భాగంగా ముందుగానే గర్భిణులపై దృష్టి సారిస్తున్నాం. వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునేలా చూస్తున్నాం. రక్తహీనత సమస్య లేకుండా చూస్తాం. ఎదిగే పిల్లలు బరువు తక్కువగా ఉన్నట్లు భావిస్తే పౌష్టికాహార పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ చికిత్స అందిస్తారు.
- బి.జగన్నాథరావు, డీఎంహెచ్‌వో, పార్వతీపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని