logo

ఆర్వో కల్పనాకుమారి ఆకస్మిక బదిలీ

సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణిగా కూడా ఉన్నారు.

Published : 24 Apr 2024 04:54 IST

ఆగమేఘాలపై జేసీకి అదనపు బాధ్యతలు

ఆ వెంటనే పీవోగా శుభమ్‌ బన్సాల్‌ నియామకం

 

శుభమ్‌ బన్సాల్‌

ఈనాడు, పార్వతీపురం మన్యం: సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణిగా కూడా ఉన్నారు. తక్షణం బాధ్యతల నుంచి తప్పుకొని అమరావతిలోని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై జిల్లా అధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా జిల్లాలో ఉన్న ఓ ఉన్నతాధికారితో ఆమెకు పొసగడం లేదని, గిరిపుత్రుల ప్రగతికి వెచ్చించాల్సిన నిధులను ఆయన చెప్పినట్లే ఖర్చు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు సదరు అధికారి నివాస గృహానికి మరమ్మతులు, ఇతర అవసరాల పేరిట నిధులను ఐటీడీఏ నుంచి మళ్లించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇది మనసులో ఉంచుకున్న ఆ అధికారి ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా ఫిర్యాదు చేయడంతో ఆమెను అమరావతికి బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 సీతంపేట: కల్పనా కుమారి బదిలీ నేపథ్యంలో ఆమె స్థానంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌(జేసీ) ఎస్‌.ఎస్‌.శోభికకు పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగించారు. ఈమేరకు ఐటీడీఏ కార్యాలయానికి వచ్చిన ఆమె విధుల్లో చేరారు. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిణిగా కూడా వ్యవహరించనున్నారు. పీవోగా ఎస్‌.హెచ్‌.శుభమ్‌ బన్సాల్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వెంటనే బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. ఆ నివేదికను బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట లోపు కమిషన్‌కు నివేదించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని