logo

ముగ్గురు దొంగల అరెస్టు

ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులు అపహరిస్తున్న దంపతులతో పాటు... ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న మరో వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు మంగళవారం

Published : 29 Jun 2022 02:38 IST

రూ.7.50 లక్షల సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు, సీఐ రాఘవరావు

ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులు అపహరిస్తున్న దంపతులతో పాటు... ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న మరో వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7.50 లక్షల విలువైన... 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు ఆ వివరాలు వెల్లడించారు. జిల్లాలో చోరీలు పెరిగిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌ ఆదేశాల మేరకు ఒంగోలు రెండో పట్టణ సీఐ ఎన్‌.రాఘవరావు ఆధ్వర్యంలో... ఒకటో పట్టణ, కొత్తపట్నం ఎస్సైలు నాగేశ్వరరావు, కె.మధుసూదన్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు... అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన భార్యాభర్తలు కట్టా జ్యోతి, రమేష్‌ కొండపిలో ఉంటూ బస్టాండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆత్రేయపురానికే చెందిన తాడిపర్తి రవి అలియాస్‌ శ్రీను అనే యువకుడు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో ఒంగోలు - కొత్తపట్నం రోడ్డులోని నల్లవాగు వద్ద వారిని అరెస్టు చేసి... చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్సై బాలాంజనేయులు (బాల), హెడ్‌ కానిస్టేబుల్‌ జి.అంకమ్మరావు, కానిస్టేబుళ్లు అంజిబాబు, చాంద్‌బాషాలను డీఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని