logo

జాతీయ రహదారిపై సీఐ వీరంగం

ఓ సీఐ స్థాయి అధికారి వ్యవహారం బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. భార్యపై ఏకంగా జాతీయ రహదారిపై వాహనదారుల నడుమ చేయిచేసుకోవడమే గాక కారులోకి విసిరేయడం కలకలం రేపింది.. 

Published : 30 Nov 2022 02:07 IST

అంతా చూస్తుండగానే భార్యపై దాడి

ఒంగోలు నేరవిభాగం: ఓ సీఐ స్థాయి అధికారి వ్యవహారం బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. భార్యపై ఏకంగా జాతీయ రహదారిపై వాహనదారుల నడుమ చేయిచేసుకోవడమే గాక కారులోకి విసిరేయడం కలకలం రేపింది..  ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఒక స్టేషన్‌ బాధ్యతలు చూస్తున్న ఆ అధికారి మొదటినుంచీ వివాదాస్పదమే. ఎక్కడ విధులు నిర్వహించినా కుటుంబాన్ని అక్కడకు మార్చకుండా హోటళ్లలోనే బస చేస్తూ వ్యవహారాలు చక్కబెడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. మంగళవారం ఉదయం పోలీసు దుస్తుల్లోనే ఆయన గుంటూరు వెళ్లారు. భార్యతో కలిసి కారులో ఒంగోలుకు బయలుదేరారు. మార్గం మధ్యలో వారిద్దరి మధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ అధికారి భార్య మార్టూరు సమీపంలో వాహనం నుంచి దిగిపోయారు. ఆయన కూడా కారు దిగి నడిరోడ్డుపైనే భార్యపై చేయిచేసుకున్నట్లు తెలిసింది. కొందరు వారించేందుకు ప్రయత్నించగా ఆయన బెదిరించారు. తన భార్యను విసురుగా కారులో కూర్చోబెట్టి ముందుకుసాగారు. కారు నంబరుతో సహా పోలీసులకు సమాచారం అందడంతో వారు టోల్‌ప్లాజా సిబ్బందికి తెలిపి ఆపాలని కోరారు..సీఐ దంపతులని తెలియడంతో వెనక్కు తగ్గినట్లు తెలిసింది. ఉదయం స్టేషన్‌ నుంచి వెళ్లిన ఆ అధికారి సాయంత్రం సుమారు అయిదున్నర గంటలకు తిరిగి విధులకు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని