logo

YV Subba Reddy - Balineni Srinivasa Reddy: బావ X బామ్మర్ది

బావా బామ్మర్దుల మధ్య రాజకీయ పోరు జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. ఆధిపత్యం కోసం వారిద్దరూ సాగిస్తున్న సమరం అధికారులకు సంకటంగా మారింది.

Updated : 05 May 2023 10:56 IST

పట్టు కోసం పంతాలు
డీఎస్పీ పోస్టింగుపై ప్రతిష్ఠంభన

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:బావా బామ్మర్దుల మధ్య రాజకీయ పోరు జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. ఆధిపత్యం కోసం వారిద్దరూ సాగిస్తున్న సమరం అధికారులకు సంకటంగా మారింది. ఎప్పుటికప్పుడు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఎత్తులు పైఎత్తులు వేస్తుండటం జిల్లాలో పరిణామాలను శరవేగంగా మార్చేస్తున్నాయి. ఈ కోవలోకి తాజాగా ఒంగోలు డీఎస్పీ పోస్టు వచ్చి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలను బదిలీ, నియమిస్తూ ఏప్రిల్‌ 20వ తేదీ అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. వాటిలో ఒంగోలు, మార్కాపురం డీఎస్పీల నియామకాలు కూడా ఉన్నాయి. మార్కాపురం డీఎస్పీగా వీరరాఘవరెడ్డి నియామకంలో ఏ అభ్యంతరాలూ తలెత్తలేదు. ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్ధన్‌ రెడ్డి నియామకం మాత్రం వివాదాస్పదంగా మారింది. ఈ పోస్టింగ్‌ వెనుక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి, తితిదే ఛైర్మన్‌, మాజీ ఎంపీ తన బావ అయిన వై.వి.సుబ్బారెడ్డి పాత్ర ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భావించడమే దీనికి ప్రధాన కారణం.

* అందరివాడే అయినప్పటికీ...: 1996 బ్యాచ్‌ ఎస్సైగా పోలీసు శాఖలో ప్రవేశించిన అశోక్‌వర్ధన్‌ రెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎస్సైగా, సీఐగా పనిచేశారు. నేర పరిశోధనలో దిట్ట అనే పేరుంది. పలు కీలక కేసులు చేధించారు. జిల్లాకు సంబంధించి అన్ని పార్టీలూ, అందరు నాయకులతో కలుపుగోలుగా ఉంటారనే పేరుంది. వివాదాస్పదంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. డీఎస్పీగా ఉద్యోగోన్నతికి ముందు ఆయన అద్దంకి సీఐగా పనిచేశారు. డీఎస్పీ హోదా వచ్చిన తర్వాత ఒంగోలులోనే విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తూ వచ్చారు. తాజా బదిలీల్లో ఆయన్ను ఒంగోలు సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారిగా నియమించారు.

* ఆశీస్సులున్న వారిని కాదని...: ఇప్పటి వరకు ఒంగోలు డీఎస్పీగా యు.నాగరాజు వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న హరినాథ్‌రెడ్డి ఒంగోలు పోస్టింగ్‌పై దృష్టి సారించారు. ఆయనకు మాజీ మంత్రి బాలినేని ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం సాగింది. ఈ కోవలోనే నాగరాజు బదిలీ అవుతారని, ఆయన స్థానంలో హరినాథ్‌రెడ్డి వస్తారనే ప్రచారం పోలీసు వర్గాల్లో గత ఆరు నెలలుగా సాగుతోంది. ఎప్పటికప్పుడు డీఎస్పీల బదిలీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇంతలోనే అనూహ్యంగా ఒకేసారి 77 మంది డీఎస్పీలకు స్థానచలనం కలిగింది. అందులో భాగంగా ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్ధన్‌ రెడ్డిని కేటాయించారు. ఈ వ్యవహారం మాజీ మంత్రి బాలినేనిని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తాను ప్రతిపాదించిన డీఎస్పీని ప్రతిపాదనలోకి తీసుకోకుండా సజ్జల, వైవీ సూచనలతో ఆయన్ను నియమించారంటూ బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. బుజ్జగింపు చర్యల్లో భాగంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో ఇటీవల సాగిన భేటీలో ఒంగోలు డీఎస్పీ నియామకాన్ని ప్రధానంగా తెర పైకి తెచ్చినట్టు సమాచారం.

* పట్టుదలతోనే ఈ హైడ్రామా...: సీఎం జగన్‌తో భేటీ తర్వాత డీఎస్పీ నియామకంలో ఏం జరుగుతుందనే చర్చ సాగింది. అప్పటికే అశోక్‌వర్ధన్‌రెడ్డిని విజిలెన్స్‌ విభాగం నుంచి రిలీవ్‌ చేశారు. సాంకేతిక పరిస్థితుల నేపథ్యంలో నాలుగు రోజుల్లో తనకు నూతనంగా కేటాయించిన పోస్టులో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అప్పటి వరకు కొనసాగిన డీఎస్పీ నాగరాజు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం కొద్దిసేపు కార్యాలయంలో ఉన్నారు. ఆ తర్వాత బాధ్యతల నుంచి వైదొలగమంటూ ఆయనకు మౌఖిక ఆదేశాలు అందాయి. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుదలతోనే ఇంత హైడ్రామా నడిచిందని పోలీసు, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

* అతనా.. మధ్యేమార్గమా..!: తాజా పరిణామాల నేపథ్యంలో ఒంగోలు డీఎస్పీగా ఎవరు రానున్నారు, ఎవరికి ఈ బాధ్యతలు కేటాయించనున్నారనే చర్చ విస్తృతమైంది. అశోక్‌వర్ధన్‌రెడ్డిని పక్కనబెట్టిన తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించిన విధంగా హరినాథరెడ్డిని తీసుకొస్తారా, మధ్యేమార్గంగా ఇంకెవరినైనా నియమిస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దర్శిలో సుమారు రెండేళ్లుగా పనిచేస్తున్న కె.నారాయణస్వామిరెడ్డిని ఒంగోలుకు బదిలీ చేయవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. ఆయన కడప జిల్లా వాసి. ఒకటీ రెండ్రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బావా బామ్మర్దుల రాజకీయ క్రీడలో చివరికి అధికారులు బలవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని