logo

ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం

ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని  ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు.

Published : 28 Mar 2024 02:08 IST

ఏకేయూ ఉప కులపతి అంజిరెడ్డి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని  ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో ఆక్వాకల్చర్‌ విభాగం ఆధ్వర్యంలో జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిపుణులైన విద్యావంతులకు ఆక్వాకల్చర్‌ రంగంలో గిరాకీ ఉందన్నారు. భారత దేశంలో గుజరాత్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ తీర ప్రాంతం ఉందని, ఇది ఎంతో కీలకమన్నారు. ఉమ్మడి ప్రకాశంలో 56 మండలాలుండగా 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో తీరప్రాంతం ఉందన్నారు. ఇది ఆక్వాకల్చర్‌కు అనువైనదిగా పేర్కొన్నారు. ఈ రంగంలో పనిచేసేవారికి మేలు చేకూర్చే విధంగా కాలానికి అనుగుణంగా విశ్వవిద్యాలయంలో కోర్సు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సభాధ్యక్షుడు రిజస్ట్రార్‌ హరిబాబు మాట్లాడుతూ నేటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆక్వా కల్చర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కోర్సును అభ్యసించే విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. చెన్నైకు చెందిన ఐసీఏఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.కైలాసం మాట్లాడుతూ ఉప్పునీటి చేపల పెంపకం గురించి వివరించారు. ఉప్పునీటి చేపల జాతిలో ఫిన్‌ఫిష్‌ జాతి ఆధిపత్యం కొనసాగిస్తోందన్నారు. ఆక్వాకల్చర్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆక్వారంగంపై ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మెరైన్‌ సైన్స్‌ విభాగం సహాయ ఆచార్యులు వెంకటరాయలు, అవంతి ఆక్వా ఫీడ్స్‌ మేనేజర్‌ నరేంద్రబాబు, కె.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని