logo

మస్టర్లు మీకు.. ఓట్లు మాకు

అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రలోభాలపర్వంగా మార్చేందుకు వైకాపా నాయకులు కొందరు తహతహలాడుతున్నారు. తాజాగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అందుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

Published : 16 Apr 2024 04:13 IST

ఎన్నికల వేళ రాజకీయ ఉపాధి
కూలీలతో నాయకుల బేరసారాలు

పెద్దారవీడు, న్యూస్‌టుడే: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రలోభాలపర్వంగా మార్చేందుకు వైకాపా నాయకులు కొందరు తహతహలాడుతున్నారు. తాజాగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అందుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కూలీలు ఎర్రని ఎండలో కష్టపడి పనులు చేస్తే వారానికి రూ.400 బిల్లులు మంజూరు చేయడమే ఇప్పటి వరకు గగనం. సార్వత్రిక ఎన్నికలు తరుముకు రావడంతో ఇప్పుడు ఉదార స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు. పనికి రాకున్నప్పటికీ మస్టర్లు వేసి కూలిస్తామని చెబుతున్నారు. ఓటు మాత్రం తమ అభ్యర్థికేనంటూ బేరసారాలకు దిగుతున్నారు. పెద్దారవీడు మండలంలోని పంచాయతీల్లో ఈ తరహా ధోరణి ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది.
ప్రలోభాలకు తెర లేపారు...: అక్రమాలకు పాల్పడటంతో గతంలో పనిచేసిన ఏపీవో సస్పెండ్‌కు గురయ్యారు. ఏడాది నుంచి ఈసీగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇదే అదునుగా కొందరు రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. కూలీలు పనికి రాకున్నా క్షేత్రసహాయకులతో మస్టర్లు వేయిస్తామని, ప్రతిఫలంగా ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత తమకు కొంత ముట్టజెప్పేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో క్షేత్ర సహాయకులు చాలా వరకు అధికార పార్టీకి చెందినవారే. ఇదే అదునుగా ఉచిత మస్టర్లను ఓట్లుగా మలచుకునేందుకు మండల స్థాయి అధికార పార్టీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. పనికి వెళ్లకపోయినా వంద రోజులకు మస్టర్లు వేస్తామని, తమకు అనుకూలంగా ఉండాలంటూ కూలీలను కోరుతున్నారు.
పర్యవేక్షణ మరిచిన అధికారులు...: నిబంధనల ప్రకారం పని ప్రదేశాలకు టెక్నికల్‌్ అసిస్టెంట్లు ప్రతి రోజూ వెళ్లి తనిఖీలు చేసి కొలతలు తీసుకుని మస్టర్లు వేయాలి. కానీ ఇక్కడ టెక్నికల్‌ అసిసెంట్లు కేవలం బుధవారం, శనివారం కార్యాలయానికి వస్తున్నారు. మండల స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో పనుల్లో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఈ విషయమై ఇన్‌ఛార్జి ఏపీవో మంత్రునాయక్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని.. ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రసహాయకులుగా కుటుంబ సభ్యుల పేరు ఉండి, మరొకరితో పనులు చేయిస్తున్న వారిని, రాజకీయ సభలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని గుర్తించి తొలగించినట్లు తెలిపారు.

పనులు చేస్తున్న ఉపాధి కూలీలు(పాత చిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని