logo

నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

Published : 18 Apr 2024 03:12 IST

మాట్లాడుతున్న ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, చిత్రంలో జిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఆసాంతం నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు. పారదర్శకత, నిష్పాక్షికతతో విధులు నిర్వహించాలని అన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కును ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అక్రమ మద్యం, నగదు రవాణా, పంపిణినీ సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ప్రచారానికి వచ్చే ముఖ్య నాయకులకు భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ గురించి సమగ్ర సమాచారం సేకరించి తదనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసు అధికారులు తమ పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లను సందర్శించాలని అన్నారు. జిల్లా ఎన్నికల ప్రణాళిక ప్రకారం  బందోబస్తు చేపట్టి కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని అన్నారు. పోలీసు స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విజిబుల్‌ పోలీసింగ్‌ను పెంచాలని, నిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలనీ, నేరచరిత్ర కలిగిన వారిని బైండోవర్‌ చేయాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలపై ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఐజీకి వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎస్‌.వి.శ్రీధర్‌రావు, అశోక్‌బాబు, డీఎస్పీలు కిషోర్‌బాబు, రామరాజు, అశోక్‌వర్థన్‌, సి.హెచ్‌.శ్రీనివాసరావు, ట్రైనీ డీఎస్పీ షహనాజ్‌, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌, జిల్లాలోని సీఐలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని