logo

వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు

ఈ నెల 10న ఒంగోలు సమతానగర్‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్‌లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు.

Published : 18 Apr 2024 03:24 IST

రాజీనామాలు చేయాలంటూ ఒత్తిళ్లు
పట్టించుకోని అధికార యంత్రాంగం
ఈనాడు, ఒంగోలు

కనిగిరిలో రాజీనామా పత్రాలతో వాలంటీర్లు

ఈ నెల 10న ఒంగోలు సమతానగర్‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్‌లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. వార్డు వాలంటీర్‌ సుజన ప్రియ ప్రచారంలో పాల్గొనడాన్ని గుర్తించి ఆమె అడిగారు. ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. జెండా కర్రలతో ప్రభావతి కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మూడు రోజులపాటు ఒంగోలు నగరాన్ని రణరంగంగా మార్చింది. ఇదిలా ఉంటే వివాదానికి కారణమైన సదరు వాలంటీర్‌ ఈ నెల 6న రాజీనామా చేశారని, 7న ఆమోదించామని అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ రోజు ప్రచారంలో వాలంటీర్‌ లేకుంటే వివాదానికే తావు లేదు.

ముందస్తు చెల్లింపులు...: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే పేరుతో 50 ఇళ్లకు ఒకరిని నియమించినట్లు గొప్పలు చెప్పుకొని.. ఇప్పుడు వారితో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నానాపాట్లు పడుతున్నారు. వాలంటీర్లతో ఓటర్ల పూర్తి సమాచారాన్ని వైకాపా ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. సంక్షేమ పథకాల సాకు చూపుతూ తమకు ఓట్లు వేయించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకుంటున్న ఉద్యోగులెవరూ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనకూడదన్న ఈసీ ఉత్తర్వులతో వారి కుతంత్రాలకు తెర పడింది. దీంతో మరో కొత్త నాటకానికి ఇప్పుడు తెర లేపారు. వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నారు. గెలిచాక మీకే ఉద్యోగాలంటూ మాయమాటలు చెబుతున్నారు. తమకు అనుకూలంగా పనిచేసేందుకు గాను ముందస్తుగా రూ. వేలల్లో నగదు చెల్లిస్తున్నారు. ప్రచారంలో పాల్గొనడాన్ని స్థానికులు ఎవరైనా నిలదీస్తే రాజీనామాలు చేశామంటూ తెలుపుతున్నారు. అధికారులు కూడా వైకాపా ప్రజాప్రతినిధులకు వంత పాడుతూ వివాదం తలెత్తిన ఒకటీ రెండు రోజులకు ముందుకు రాజీనామాలను ఆమోదించినట్లు తాపీగా సెలవిస్తున్నారు.

ఎదురు తిరుగుతున్నారు...: జిల్లాలో మొత్తం 719 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 6,797 మంది విధులు నిర్వహిస్తున్నారు. యాభై ఇళ్లకు ఒకరు చొప్పున దాదాపు 11,500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రజాధనాన్ని వేతనంగా పొందుతున్న వీరిలో ఎక్కువమంది వైకాపా కార్యకర్తలు, అభ్యర్థుల తరఫున ప్రచార కార్యకర్తల అవతారమెత్తారు. కొందరు నేతలు వీరిని భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి సొంత పార్టీ కార్యకర్తలుగా వినియోగించుకుంటున్నారు. అభ్యర్థులు, ఓటర్లకు మధ్య ప్రలోభాలకు గురిచేసే వారధులుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 42 మంది కోడ్‌ ఉల్లంఘించి అధికారుల వేటుకు గురయ్యారు. మరికొందరు తమకు ఉద్యోగం అవసరమని, ఒత్తిళ్లు తేవొద్దని నేతలకు చెబుతూ రాజీనామాలకు ససేమిరా అంటూ ఎదురుతిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వివాదాలకు తావు లేకుండా ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని