logo

ఆంక్షలతో అష్టకష్టాలు

ఒంగోలులోని కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు.

Published : 19 Apr 2024 03:06 IST

కలెక్టరేట్‌ ఎదుట మూతపడిన దుకాణాలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలులోని కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఈసీ నిబంధనల ప్రకారం 100 మీటర్ల దూరంలో ఎవరినీ రానివ్వకూడదంటూ పోలీసులు నాలుగు వైపులా బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు విధించారు. పోస్టాఫీసు, చర్చి సెంటర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, పాత ఎస్‌బీఐ, అంబేడ్కర్‌ భవన్‌రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను పక్క రోడ్లకు మళ్లించారు. దీంతో చిన్న వీధుల్లో వెళ్లేందుకు వాహనారులు ఇబ్బందులు పడ్డారు. ఒంగోలు నుంచి టంగుటూరు వైపు; టంగుటూరు నుంచి ఒంగోలుకు వచ్చే ఆర్టీసీ బస్సులను పాత బైపాస్‌ మీదగా డిపోకు మళ్లించారు. దీంతో వ్యక్తిగత పనుల నిమిత్తం లేదా వైద్యశాలకు వచ్చే రోగులు నెల్లూరు బస్టాండ్‌కు వచ్చేందుకు దక్షిణ బైపాస్‌లో దిగి ఆటోలను ఆశ్రయించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ఉదయం 10 గంటల తర్వాత ఉద్యోగులతోపాటు, ఇతరులను అనుమతించలేదు. దీంతో కొందరు ఉద్యోగులు వెనుదిరిగారు. కలెక్టరేట్‌లో పలు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పోస్టాఫీసు ఉన్నాయి. వాటిలో వ్యక్తిగత పని నిమిత్తం వచ్చిన వారిని కూడా పోలీసులు అనుమతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ప్రకాశం భవన్‌ ఎదురుగా పలు దుకాణాలు ఉన్నాయి. ఆంక్షల నేపథ్యంలో అవి కూడా మూతపడ్డాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 29వ తేది వరకు కొనసాగనున్న నేపథ్యంలో వారి జీవనోపాధిపై ప్రభావం చూపనుంది. చాలామందికి ముందస్తు సమాచారం లేకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు