logo

అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం

సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు.

Published : 19 Apr 2024 03:22 IST

 నామినేషన్ల ప్రక్రియ మొదలు|
తొలిరోజు 13 మంది దాఖలు 

ఒంగోలు కలెక్టరేట్‌ ప్రవేశ ద్వారం వద్ద పోలీసు పహారా

ఈనాడు, ఒంగోలు: పామూరు, న్యూస్‌టుడే:  సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. ఎన్నికల క్రతువులో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌(ప్రమాణ పత్రం) అత్యంత కీలకం. తమ వివరాలతో పాటు ఆస్తులు, అప్పుల గురించి అందులో ముందే స్పష్టం చేయాలి. గతంలో ఏమైనా కేసులున్నా, శిక్ష పడినా తెలపాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కలిపి దాఖలు చేసే పత్రమే అఫిడవిట్‌. అందులో తప్పుడు సమాచారం పొందు పరిస్తే అదే ప్రత్యర్థులకు ఆయుధమవుతుంది. వివాదం కోర్టు కేసుల వరకు వెళ్లడమే కాకుండా ఏకంగా అనర్హత వేటుకు దారి తీసే ప్రమాదముంది. దాఖలు సమయంలోనే అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. పొరపాట్లు చేస్తే తిరస్కరణకు గురికాక తప్పదు. గతంలో ఇలాంటి పొరపాటుతో కనిగిరి నియోజకవర్గంలో కదిరి బాబూరావు నామపత్రం చెల్లకుండా పోయింది.

లెక్క.. ఉండాల్సిందే పక్కా...

స్థిర, చరాస్తుల వివరాలతో పాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్‌, బీమా పాలసీలు, అప్పులు వంటి వివరాలను నామపత్రంలో పొందుపరచాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య స్థలాలు, నివాస స్థలాల వంటి వాటినీ ప్రస్తావించాలి. అవన్నీ వారసత్వంగా సంక్రమించాయా.. కొనుగోలు చేశారా అనేది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్‌ విలువను వివరించాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలుంటే వాటి వివరాలూ తెలపాలి. కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ కంపెనీల కాంట్రాక్టులున్నా బయట పెట్టాలి. క్రిమినల్‌ కేసులు, ఏదైనా కేసులో న్యాయ స్థానాలు శిక్ష విధించినా, అప్పీల్‌కు వెళ్లినా సదరు సమాచారం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలపాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌కు నోటరీ తప్పనిసరి.

అన్నీ పూరించాల్సిందే...

అఫిడవిట్‌లోని ఏ ఒక్క కాలమ్‌ ఖాళీగా వదలరాదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. గుర్తింపు పొందని పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ పత్రంలో ఈసీఐ సూచించిన ఫ్రీ సింబల్స్‌ నుంచి తమకు కేటాయించాల్సిన గుర్తులు మూడింటిని ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి వివరాలతో సమర్పించకుంటే పరిశీలన(స్క్రూటినీ) సమయంలో తిరస్కరణకు గురవుతుంది. ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ఆర్వోలు నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు