logo

నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు

నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు.

Published : 19 Apr 2024 03:26 IST

కలెక్టరేట్‌ వద్ద భిక్షాటన కార్యక్రమంలో పాల్గొన్న 98 డీఎస్సీ అభ్యర్థులు (పాత చిత్రం)

కంభం, న్యూస్‌టుడే: నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరికీ ఉద్యోగాలిస్తానని నాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అర్హులైన 730 మంది ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. వారిలో 165 మందికి మాత్రమే 2023లో ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటికే 60 ఏళ్ల వయస్సు నిండిన వారు మినహా.. ఇంకా 506 మంది అర్హులు ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ గతేడాది ఏప్రిల్‌ నుంచి ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నాయకులను కలిసి విన్నవించారు. ధర్నాలు, దీక్షలు, రిలే దీక్షలు, భిక్షాటనలు, కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోయింది.  

అంతా లోపభూయిష్ఠం...: జీవో నంబర్‌ 27 ప్రకారం 60 ఏళ్లలోపు అభ్యర్థులను ఉద్యోగాలకు పిలిచారు. కానీ 98 డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకారం ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్లు మాత్రమే. అదే జీవో ప్రకారం ఉద్యోగంలో చేరిన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని నిబంధన విధించారు. కానీ 59 సంవత్సరాల 11 నెలలు నిండిన వారిని ఉద్యోగంలోకి తీసుకున్నారు. వారు బ్రిడ్జి కోర్సు ఎలా చేస్తారనే విషయాన్ని అధికారులు విస్మరించారు. ఉద్యోగంలో చేరిన నెలలోపుగానే విరమణ అయ్యేవారికి ఎలా ఉద్యోగం ఇచ్చారని, ఆ కారణంగా పోస్టులు వృథా అయ్యాయని వాపోతున్నారు. ఇలా చేయడం మోసం కాదా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పోస్టుల భర్తీలో రోస్టర్‌ పాటించకపోవడంతో అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని