logo

అన్నదాతకు ముప్పుతిప్పులు!

రైతు ఆరుగాలం శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Updated : 03 Feb 2023 05:36 IST

 పంట విక్రయానికి  ఆటంకాలు

జిల్లాలో ఆరుగాలం వరిపంటను సాగు చేసిన అన్నదాతకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త నిబంధనలు, సాంకేతిక సమస్యల పేరుతో ముప్పుతిప్పులు పెడుతూనే ఉన్నారు. వాహనాలపై ధాన్యం బస్తాలు వేసుకుని రోడ్లపై తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి రెక్కల కష్టాన్ని అమ్మాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. సకాలంలో ట్రక్‌షీట్లు మంజూరు చేయడం లేదు, మిల్లులు కేటాయింపు జరగడం లేదు. కొన్నిచోట్ల ఈ రెండూ వచ్చినా కేటాయించిన మిల్లుకు లక్ష్యం పూర్తయిందని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక రైతన్నలు రోజుల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు.

న్యూస్‌టుడే, నరసన్నపేట, బృందం


జిల్లావ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ వరకు 614 రైతు భరోసా కేంద్రాల ద్వారా 90,160 మంది రైతుల నుంచి ప్రభుత్వం 4.02 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొదటి నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇంకా 36 వేల టన్నుల వరకు కొనాల్సి ఉంది. దీంతో పాటు కొత్తగా 40 వేల టన్నుల లక్ష్యాన్ని కొంటామని ప్రకటించారు. ఈ సమాచారం తెలియడంతో అన్నదాతలు ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నారు. పంట అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఓ వైపు సాంకేతిక సమస్యలు తలెత్తడం, కొన్ని లోపాల కారణంగా ప్రక్రియ వేగంగా ముందుకు సాగక రైతులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం 76 వేల టన్నుల ధాన్యాన్ని ఈ నెల రెండో వారంలోగా కొనాల్సి ఉన్నందున ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఆందోళన

ఈ చిత్రంలో ధాన్యం నిల్వలు గార మండలం శ్రీకూర్మం పంచాయతీకి చెందిన కౌలురైతు కోరాడ గోవిందరాజులువి. ఈయన నాలుగున్నర ఎకరాల్లో సాగు చేయగా.. 90 క్వింటాళ్ల ధాన్యం విక్రయించేందుకు అనుమతి వచ్చిందని ఆర్బీకే నుంచి సమాచారమిచ్చారు. అందులో ఇంతవరకు 25 క్వింటాళ్లు మాత్రం కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యం నిల్వలు ఇలాగే ఉండిపోయాయి. కొనుగోలు గడువు సమయం దగ్గర పడుతుండటంతో రైతు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా ట్రక్‌షీట్లు రావడంలో జాప్యం జరుగుతోందని, రాగానే సమాచారం ఇస్తామని ఆర్బీకే సిబ్బంది చెబుతున్నారు.

న్యూస్‌టుడే, గార


నిరీక్షణ

కోటబొమ్మాళి మండలం కన్నేవలస వద్ద గురువారం ఎదురైన పరిస్థితి ఇది.. కస్తూరిపాడు గ్రామసచివాలయ పరిధిలోని దుప్పలపాడు, కోటబొమ్మాళి పరిధిలోని మంచాలపేట, గుంజిలోవ ప్రాంతాల రైతులు, అధికారులు చెప్పారని వాహనాలతో ధాన్యం నిల్వలను కన్నేవలస వేబ్రిడ్జికి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలనే సమాచారం లేక ఇలా వాహనాలతో ఉదయం నుంచి అక్కడే ఉండాల్సి వచ్చింది. వ్యవసాయ సహాయకుడి సమాచారం మేరకు వీరంతా ధాన్యం తీసుకొచ్చారు. తీరా వేబ్రిడ్జి వద్దకు వెళ్లేసరికి లక్ష్యం పూర్తయిందని వదిలేశారు.

న్యూస్‌టుడే, కోటబొమ్మాళి


ఆవేదన

నందిగాం మండలం నర్సిపురం, దేవళభద్ర, జల్లపల్లి, దిమిలాడ, లఖిదాసుపురం గ్రామాల రైతులు దాదాపు 40 ట్రాక్టర్లపై దిమిలాడ వేబ్రిడ్జికి ధాన్యం తీసుకొచ్చారు. ట్రక్‌షీట్లలో సరకు లెక్క ఇచ్చారు. ఏ మిల్లుకు కేటాయించారో అనే విషయం మాత్రం లేదు. దీంతో సరకుతో నర్సిపురం ఆర్బీకేకు వారంతా చేరుకున్నారు. పంటను అమ్ముకునేందుకు ఇదేం దుస్థితి అంటూ నిరసన తెలియజేశారు. ‘సాంకేతిక లోపం వల్లే మిల్లుల కేటాయింపు రాలేదు. జిల్లా అధికారులతో మాట్లాడాం’ అంటూ నందిగాం వ్యవసాయ అధికారి సెలవిచ్చారు.

న్యూస్‌టుడే, నందిగాం  


ధాన్యం కొనగలరా లేదా..?

ప్రభుత్వాన్ని నిలదీసిన అచ్చెన్నాయుడు

ఆగ్రహం

టెక్కలి, సంతబొమ్మాళి, న్యూస్‌టుడే : రైతు ఆరుగాలం శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం, ఎస్బీ కొత్తూరు గ్రామాల్లో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన ముందు ఏకరవు పెట్టారు. దూరంగా ఉన్న మిల్లులకు కేటాయిస్తున్నారని, అక్కడ ధాన్యం దించాక అయిదు నుంచి పది కిలోలు అదనంగా అడుగుతున్నారని పలువురు రైతులు ఆరోపించారు. ఇప్పటికీ గ్రామాల్లో ధాన్యం నూర్పిడికాకుండా ఉన్నాయని మరికొందరు తమ బాధలను వివరించారు. ధాన్యాన్ని అమ్ముకోలేకపోతే ఎలా బతకగలం అంటూ వాపోయారు. రైతుల బాధలు విన్న అచ్చెన్నాయుడు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. జిల్లాలో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పడిందని అధికారులే ప్రకటించారని, ఇప్పటి వరకు కేవలం నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి లక్ష్యాలు పూర్తయ్యాయని చేతులు దులుపుకోవడం ఏంటని తూర్పారబట్టారు. రైతులకు నరకం చూపిస్తున్న రాబందులను త్వరలోనే గద్దె దించుతారని హెచ్చరించారు. అధికారులు, నాయకులు రైతుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఈయన తోపాటు తెదేపా నేతలు జీరు భీమారావు, కూచెట్టి కాంతారావు, రెడ్డి అప్పన్న, రాజశేఖర్‌ పాల్గొన్నారు.


ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు..

నేను పండించిన 25 బస్తాలను ట్రాక్టరులో దిమిలాడ ధర్మకాటాకు తీసుకొచ్చాను. ట్రక్‌షీటులో సరకు విషయం పేర్కొన్నా ఏ మిల్లుకు వెళ్లాలో అన్న విషయం పేర్కొనలేదు. దీంతో నేను ఎక్కడికి వెళ్లాలో పాలుపోలేదు. 24 గంటల నుంచి తిండి లేక ఇబ్బంది పడ్డాను.

దాసరి అప్పయ్య, రైతు, దేవళభద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని