logo

అయిదేళ్లుగా ఆటంకమే!

వైకాపా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత క్రీడల సంగతి గాలికొదిలేసింది. అయిదేళ్లలో మైదానాల అభివృద్ధికి రూపాయి కూడా మంజూరు చేయలేదు.

Published : 27 Mar 2024 03:31 IST

అభివృద్ధికి నోచుకోని పాత్రునివలస క్రీడా మైదానం
న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

వైకాపా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత క్రీడల సంగతి గాలికొదిలేసింది. అయిదేళ్లలో మైదానాల అభివృద్ధికి రూపాయి కూడా మంజూరు చేయలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. శ్రీకాకుళం నగర పరిధిలోని పాత్రునివలసలో బహుళ క్రీడా సముదాయమే అందుకు నిదర్శనం.

తెదేపా హయాంలో నియోజకవర్గానికి ఒక క్రీడామైదానం మంజూరు చేశారు. అందులో భాగంగా పాత్రునివలసలో సుమారు 33.33 ఎకరాల విస్తీర్ణంలో మైదానం పనులు చేపట్టారు. రూ.1.5 కోట్లతో రక్షణ గోడ ఏర్పాటు చేశారు. మరో రూ.6 కోట్లతో బహుళ క్రీడా సముదాయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పునాదులు పూర్తి చేసిన తరువాత ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి.

బిల్లుల చెల్లింపులో జాప్యం..

పాత్రునివలస క్రీడాసముదాయం నిర్మాణానికి తెదేపా రెండు దశల్లో నిధులు మంజూరు చేసింది. రక్షణ గోడ నిర్మాణానికి రూ.1.5 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1.06 కోట్లు మాత్రమే గుత్తేదారుకు చెల్లించారు. మిగిలిన రూ.44 లక్షలు పెండింగ్‌లో పెట్టారు. ఇండోర్‌ మైదానం పనుల్లో సైతం కేవలం రూ.83 లక్షలు ఇచ్చారు. మరో రూ.35 లక్షలు రావాల్సి ఉండటంతో పాటు మిగిలిన పనులకు బిల్లులే అప్‌లోడ్‌ చేయలేదు. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం కారణంగా గుత్తేదారు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం, పాలకులు సైతం వాటిపై దృష్టి సారించకపోవడంతో అయిదేళ్ల పాటు మైదానం పనులు పడకేశాయి.

సొంత నిధులతో కొన్ని పనులు..

ఆమదాలవలస కేవీకే మైదానాన్ని కొన్నేళ్ల కిందట ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు అప్పగించడంతో అక్కడ పని చేసిన సీనియర్‌ అథ్లెటిక్‌ శిక్షకుడు డా.కళ్లేపల్లి శ్రీధర్‌రావును పాత్రునివలస మైదానానికి బదిలీ చేశారు. ఆ సమయంలో కనీస వసతుల్లేని మైదానం అభివృద్ద్ధి చేసేందుకు శ్రీధర్‌రావు ముందడుగు వేశారు. సుమారు రూ.2 లక్షల సొంత నిధులతో క్రీడాకారుల అవసరాలకు ఓ గది నిర్మించారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు బిల్లులు అప్‌లోడ్‌ చేయలేదు. హాకీ శిక్షకుడు అనిల్‌కుమార్‌ సహాకారంతో హాకీ, హ్యాండ్‌బాల్‌, రన్నిôగ్‌ ట్రాక్‌లను అభివృద్ధి చేశారు. ఈ విషయమై డీఎస్‌డీవో మాట్లాడుతూ ప్రస్తుతం పాత్రునివలసలో హ్యాండ్‌బాల్‌, హాకీ శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చాక పనులు చేస్తాం’ అని స్పష్టం చేశారు.


ప్రతిపాదనలకే పరిమితం..

గతేడాది ఖేలో ఇండియా క్రీడా మైదానాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ సమయంలో పాత్రునివలస మైదానం పనులకు ప్రతిపాదనలు పంపారు. 50 మీ. ఈత కొలను, హాకీ మైదానం, 500మీ. సింథటిక్‌ ట్రాక్‌, మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో ఇప్పటి వరకు శాప్‌ నుంచి డీఎస్‌ఏకు ఎలాంటి సమాచారం అందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు