logo

ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు.

Published : 29 Mar 2024 04:46 IST

సువిధ వెబ్‌సైట్‌

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాలకు అనుమతి తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. అనుమతుల్లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టినా, సభలు, సమావేశాలు నిర్వహించినా.. మైక్‌ సెట్ల వినియోగంతో పాటు కరపత్రాలు పంపిణీ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ అనుమతులు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సువిధ’ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌, యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఇంటి నుంచే దరఖాస్తులు..

గతంలో రాజకీయ నాయకుల ప్రచారం, ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు తీసుకోకపోయినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిబంధనలు కఠిన తరం చేసి అనుమతులు అనివార్యం చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ నాయకులు తమకు నచ్చిన విధంగా చేస్తామంటే కుదరదు. తప్పనిసరిగా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే. వాటి కోసం గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల ధ్రువపత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లో సంబంధిత రిటర్నింగ్‌ అధికారి అనుమతులు జారీ చేస్తారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ స్పష్టం చేశారు. బుధవారం జేసీ నవీన్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఇప్పటికే ప్రచారాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముందస్తుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రచారం నిర్వహించినా, భారీ ప్రదర్శనలు చేపట్టినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

దరఖాస్తు ఇలా..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, రాజకీయ పార్టీలు అనుమతుల కోసం suvidha.eci.gov.in వెబ్‌సైట్‌లో నిర్దేశిత వివరాలు పొందుపరచాలి. దరఖాస్తుదారుడు లేదా అభ్యర్థి తన ఫోన్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి. ఒకసారి లాగిన్‌ అయ్యాక పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. ర్యాలీలు, జెండాలు, హోర్డింగ్‌లు, వాహనాలు, సభలు, సమావేశాలు, ప్లెక్సీల ఏర్పాటు, ఇంటింటి ప్రచారం, మైక్‌ల వినియోగం, కరపత్రాల పంపిణీ ఇలా 24 అంశాలకు సంబంధించి అనుమతులు తీసుకోవచ్చు. ఆయా అంశాలవారీగా అభ్యర్థికి కావాల్సిన అనుమతికి సంబంధించి కొన్ని పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వాటిని రిటర్నింగ్‌ అధికారి పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటే ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేస్తారు. సరైన పత్రాలు సమర్పించకుంటే తిరస్కరిస్తారు. ఇదే కాకుండా అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి నేరుగా కూడా దరఖాస్తు చేసుకుని 24 గంటల్లో అనుమతి పొందవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని